పాల్వంచ, జూన్ 28 : ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీకి నిర్వహించే పిండ ప్రదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పాల్వంచ పట్టణాధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేశ్ పటేల్, జిల్లా మహిళా నాయకురాలు కాలేరు సింధు తపస్వి పిలుపునిచ్చారు. శనివారం పాల్వంచలో జరిగిన పార్టీ సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జి వనమా వెంకటేశ్వరరావు పిలుపు మేరకు ఈ నెల 30వ తేదిన ములకలపల్లి మండలం, పూసుగూడెం గ్రామం దగ్గర గల సీతారామ ప్రాజెక్ట్ పంప్‌హౌజ్ 2 వద్ద కాంగ్రెస్ పార్టీకి పిండ ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను సస్యశ్యామలం చేయాలని, రైతాంగాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అమ్మగారిపల్లి వద్ద సీతారామ ప్రాజెక్టును మొదలుపెట్టి 18 వేల కోట్ల రూపాయలతో సుమారు 90 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయాల్సిన కాంగ్రెస్ సర్కార్ 18 నెలలుగా ఈ ప్రాజెక్టును పట్టించుకోవడం మానేసిందని విమర్శించారు. అంతేకాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్ట్ సాగునీటిని ఈ జిల్లా రైతులకు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలకు, నల్లగొండ జిల్లాకు తరలించుకపోవడం బాధాకరమన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎటువంటి సాగునీరు అందుబాటులో లేదని, సీతారామ ప్రాజెక్టు నీరు వస్తేనే ఇక్కడి రైతులకు సాగునీరు అందుతుందన్నారు. కావునా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగానికి సాగునీరు అందించిన తర్వాతే ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు తీసుకువెళ్లాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ 30వ తేదీన కాంగ్రెస్ పార్టీకి పిండ ప్రదాన కార్యక్రమం, అనంతరం జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు కలిసి ప్రతిరోజు తీవ్ర ఆందోళనలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంగ్లోత్ రంజిత్, కొత్తచెరువు హర్షవర్ధన్, కొట్టే రాఘవేంద్ర (రవి), ఆలకుంట శోభన్, గంగాధరి పుల్లయ్య, తోట లోహిత్ సాయి, దరిమెళ్ల మురళీకృష్ణ, గిద్దలూరి శివసాయి, కూరెల్లి మురళీమోహన్ పాల్గొన్నారు.