జూలూరుపాడు, జూలై 04 : విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఈ నెల 10న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ పిలుపునిచ్చారు. జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం హైస్కూల్‌ను ఏఐఎస్ఎఫ్ నాయకులు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల బంద్‌కు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం గుగులోతు వంశీ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 వేల ప్రభుత్వ పాఠశాలలను కేవలం 4 వేల కస్టర్ పాఠశాలలుగా కుదించేందుకు ప్రభుత్వం తీసుకున్న హేతుబద్ధీకరణ నిర్ణయాన్ని తక్షణమే ఉప సంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని, విద్యాసంస్థల ప్రాంగణాల్లోనే నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాంలను అధిక ధరలకు విక్రయించడాన్ని తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు అందాల్సిన సుమారు రూ.7 వేల కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ నెల 10న నిర్వహించే బంద్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు అనిల్ కుమార్, బాలాజీ, అఖిల్, అఖిలేష్, పూజ, అంజలి, అనిత పాల్గొన్నారు.