లక్ష్మీదేవిపల్లి, మే 26 : మొక్కజొన్న అన్లోడింగ్ ప్రక్రియ ఆలస్యం కాకుండా రాత్రివేళల్లో కూడా పనులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని బంగారు చిలక మొక్కజొన్న నిల్వ గోడౌన్‌తో పాటు ఇల్లెందు క్రాస్ రోడ్ వద్ద నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. బంగారు చిలక మొక్కజొన్న గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్, గోడౌన్‌కు చేరుతున్న మొక్కజొన్న లారీల అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గోడౌన్లో 2,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. సుజాతనగర్, కొత్తగూడెం, టేకులపల్లి, ఇల్లెందు, చర్ల, సమ్మెట, బూర్గంపాడు, ఆళ్లపల్లి, గుండాల తదితర మండలాల నుంచి మొక్కజొన్న ఇక్కడికి వస్తోందని తెలిపారు.
అన్లోడింగ్ ప్రక్రియ ఆలస్యం కాకుండా రాత్రివేళల్లో కూడా పనులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం తగిన లైటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే అదనపు హమాలీలను నియమించాలని సూచించారు. గోడౌన్లో మొక్కజొన్న నిల్వల అన్లోడింగ్ తీరును, బస్తాలను భద్రపరుస్తున్న విధానాన్ని పరిశీలించిన కలెక్టర్, పూర్తి నిల్వ సామర్థ్యాన్ని వినియోగించుకునేలా పంటను నిల్వ చేయాలని, ఎలాంటి నష్టం కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిల్వ సామర్థ్యాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేలా మొక్కజొన్న బస్తాలను సాధ్యమైనంత ఎక్కువ ఎత్తులో పేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. హమాలీలతో మాట్లాడిన కలెక్టర్, ఒక్క లారీ అన్‌లోడింగ్‌కు ఎంత సమయం పడుతోంది, ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. హమాలీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఇల్లెందు క్రాస్ రోడ్ వద్ద నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, పూర్తి స్థితిపై సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం మే నెలలో ప్రారంభమైన పనులు ఇప్పటివరకు పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, పనుల ఆలస్యానికి గల కారణాలను వివరంగా నివేదించాలని ఆదేశించారు. పనుల అమలులో జాప్యం చోటుచేసుకున్న కాంట్రాక్టర్లకు మెమోలు జారీ చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల వ్యయంతో మహిళా సాధికారతకు వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా భవన నిర్మాణ ప్లాన్లు, గదుల నిర్మాణం, మౌలిక సదుపాయాల పనులను పరిశీలించిన కలెక్టర్, పనులు ఎప్పటిలోగా పూర్తి అవుతాయో అధికారులను ఆరాతీశారు. పనుల పురోగతిని ప్రతిరోజూ పర్యవేక్షించాలని, నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన సంఖ్యలో కార్మికులను నియమించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవనంలోని ప్రతి బ్లాక్‌ను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేయాలని, స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్ కార్యకలాపాలకు ఉపయోగపడే విధంగా భవనాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. ఈ పరిశీలనలో తాసిల్దార్ శిరీష, పంచాయతీరాజ్ అధికారి శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

రాత్రి వేళల్లోనూ మొక్కజొన్న అన్లోడింగ్ కొనసాగేలా చర్యలు : కలెక్టర్ అంకిత్