జూలూరుపాడు, మే 31 : తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంపుదల కోసం టీఎస్ యూటీఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ప్రచార జాతాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం ఉన్నాయని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ బడులను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నదని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్స్, యూనిఫామ్స్ ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం, వారానికి మూడుసార్లు కోడిగుడ్లు, రాగిజావ ఉంటుందన్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించి పిల్లలను చేర్పించి, ఫీజుల భారం లేని ఉచిత విద్య పొందాలని, విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వ పాఠశాలలు దోహద పడుతాయని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ బడి మూతపడితే సమాజానికి నష్టం అన్నారు. మన ఊరు – మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌలిక వసతుల కల్పన మెరుగైందన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ తరగతి గదులు, లైబ్రరీ, లేబరేటరీలతో పాటు ఆటపాటలతో అహ్లాదకరమైన వాతావరణంలో, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధతో, నిపుణులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేని చదువు అందించబడుతుందన్నారు. పిల్లల మానసిక ఆరోగ్యానికి, వ్యక్తిత్వ వికాసానికి అనువుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని, మన పిల్లలను మన ఊరి బడిలోనే చేర్పించాలని కోరారు. ఈ ప్రచార జాతాలో రాష్ట్ర కార్యదర్శి బి.రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు ఎస్.వెంకటేశ్వర్లు, మండల బాధ్యులు వై.వీరాస్వామి, బి.శంకర్, గురుమూర్తి, ఆర్.నాగజ్యోతి, రామ కృష్ణమాచారి, మంగీలాల్, బి.ఈరు సురేశ్ బాబు పాల్గొన్నారు.