కొత్తగూడెం అర్బన్, జూన్ 19 : పాలిస్తీనా, గాజా, ఇరాన్‌పై ఇజ్రాయిల్ సాగిస్తున్న దాడులను తాము వ్యతిరేకిస్తున్నామని, ఈ చర్యను మనవతావాదులు వ్యతిరేకించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. గురువారం కొత్తగూడెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా ఆధిపత్య భావజాలంతో ఇతర దేశాలపై పెత్తనం చేయాలనే దురుద్దేశంతో ఇలాంటి చర్యలకు ఒదిగడుతున్నదని విమర్శించారు. అమెరికాకు బుద్ధి చెప్పాలని అన్నారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా , సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు , సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి కందగట్ల సురేందర్ పాల్గొని మాట్లాడారు. అమెరికా ప్రపంచంలోని వెనుకబడిన దేశాలపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దురాగాతాలు పాల్పడుతున్నదని విమర్శించారు. అమెరికా అనేక దేశాల మధ్య జోక్యం చేసుకుంటూ దేశాల మధ్య వైరుధ్యాలను పెంచి పోషిస్తోందని, కుట్రలతో పగలను రాజేస్తుందని ఆరోపించారు.
దీనిలో భాగంగానే తన ఆయుధ మార్కెట్ ను విస్తరించుకుంటూ ఆయా దేశాల సహజ వనరులను, సంపదను దోచుకుంటుందని మండిపడ్డారు. ఈ చర్యలను వామపక్ష పార్టీలు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మాజీ కౌన్సిలర్ కంచర్ల జమాలయ్య, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పాల్వంచ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఉప్పరబోన రాంమ్మూర్తి, జిల్లా నాయకులు లిక్కి బాలరాజు , మాస్ లైన్ జిల్లా నాయకులు జాటోత్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.