రామవరం, ఏప్రిల్ 14 : ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న క్రమంలో వెనుక వైపు నుండి వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో కార్మిక హక్కుల నేత రాసూరి శంకర్ (58) దుర్మరణం చెందారు. ఈ ఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ధన్‌బాద్ వద్ద సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ అనుబంధ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ మెంబర్, కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు రాసూరి శంకర్ కొత్తగూడెంలో పనులు ముగించుకుని బైక్‌పై గౌతంపూర్‌కు వస్తున్నాడు.
ఈ క్రమంలో ధన్‌బాద్ పోచమ్మ గుడి వద్ద నుండి గౌతమ్‌పూర్ వెళ్లేందుకు కుడివైపుకు వెళ్తున్నట్టు ఇండికేటర్, చేతుల ద్వారా చూపిస్తూ రోడ్డు దాటుతున్న క్రమంలో కొత్తగూడెం నుండి విజయవాడకు వెళ్తున్న ఒడిశాకు చెందిన వ్యక్తులు బైక్‌పై వేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న శంకర్ వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో శంకర్ కిందపడడంతో తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు 108లో సింగరేణి ప్రధాని ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడం, ముక్కు, చెవుల నుండి రక్తస్రావం అవుతుండడం, అంతేకాకుండా కుడి చేయి, ప్రక్కటెముకలు విరిగాయని మెరుగైన వైద్యం కోసం అతడిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందినట్లు సన్నిహితులు తెలిపారు. శంకర్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇటీవలే ఓ కుమార్తె వివాహం చేశారు.
శంకర్ మరణ వార్త తెలిసిన బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు దిగ్భ్రాంతికి గురయ్యారు. మిత్రుడు, ఉద్యమకారుడు, లేబర్ కాంట్రాక్ట్ యూనియన్ ప్రెసిడెంట్, టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ మెంబర్ రాసూరి శంకర్ రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరం అన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. శంకర్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ఎల్లవేళలా బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని తెలిపారు.