-స్వయంపాలనతో గిరిజన గూడేల్లో ప్రగతి వెలుగులు
-10 శాతం రిజర్వేషన్లతో దక్కిన ఆత్మగౌరవం
– జూలూరుపాడు మండలంలో కేసీఆర్ చిత్రపటాలకు బీఆర్ఎస్ నాయకుల క్షీరాభిషేకం
జూలూరుపాడు, సెప్టెంబర్ 18 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దార్శనికతతోనే గిరిజన తండాలు, గూడేలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని, తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గిరిజనుల ఆత్మగౌరవం పెంపొందేలా, వారి అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయన్నారు. జూలూరుపాడు మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో గిరిజనులతో కలిసి కేసీఆర్ చిత్రపటాలకు శుక్రవారం ఘనంగా క్షీరాభిషేకం కార్యక్రమాలను నిర్వహించారు. మండలం పరిధిలోని అనంతారం, మాచినేనిపేట తండా, అన్నారుపాడు, భోజ్యతండా, పాపకొల్లు, బేతాలపాడు, చింతలతండా, గుండెపూడి తదితర గ్రామ పంచాయతీల్లో కెసిఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లకావత్ గిరిబాబు మాట్లాడుతూ.. 500 జనాభా కలిగిన ప్రతి గిరిజన తండాను ప్రత్యేక గ్రామ పంచాయతీగా మార్చి, గిరిజనులకు స్థానిక పాలనలో భాగస్వామ్యం కల్పించిన ఘనత కేసీఆర్ దేనన్నారు. తండాలు పంచాయతీలుగా మారిన తర్వాతే మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరయ్యాయని స్పష్టం చేశారు. బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణంతో పాటు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందించడం ద్వారా తండాల రూపురేఖలు మారాయన్నారు.
రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం ద్వారా గిరిజన యువతకు విద్యా, ఉద్యోగ రంగాల్లో అపారమైన అవకాశాలు లభించాయన్నారు. అలాగే, గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించడం ద్వారా గిరిజన సంస్కృతికి అత్యున్నత గౌరవం దక్కిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ గూగులోత్ సునీత మహేష్, ఉప సర్పంచులు బాదావత్ నరేష్, బిక్కు, కుంజా రవికుమార్, మాజీ వైస్ ఎంపీపీ కోడెం సీతకుమారి, మాజీ సర్పంచ్ యదలపల్లి కలాశ్రీ వార్డు సభ్యులు వీరు, బీఆర్ఎస్ మండల నాయకులు చాపలమడుగు రామ్మూర్తి, యదలపల్లి వీరభద్రం, తాళ్లూరి రామారావు, భూక్యా సేవా, లకావత్ హేమ్లా, బానోత్ చిన్నా, భూక్యా రాందాస్, యల్లంకి సత్యనారాయణ, రెడ్డిబోయిన రాము, పురస్తపురవు రామకృష్ణ, గుమ్మడి వెంకటేశ్వర్లు, రామిశెట్టి వంశీ, బానోత్ చందర్, పోగుల నాగభూషణం, ఈసం వెంకటేష్ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గిరిజనులు హాజరయ్యారు.