– సింగరేణి సీఎండీని కోరిన గిరిజన ఉద్యోగుల సంఘం
సింగరేణి కొత్తగూడెం, సెప్టెంబర్ 02 : గతంలో వచ్చిన సర్కులర్ ప్రకారం 360 జూనియర్ అసిస్టెంట్ (గ్రేడ్-II) పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయబడింది. అనంతరం వచ్చిన సర్కులర్ ప్రకారంపై నోటిఫికేషన్ రద్దు చేయబడి మళ్లీ రీ-నోటిఫికేషన్ జారీ చేయబడిందని, ఈ పోస్టులతో పాటు నోటిఫై చేయబడిన ఇతర పోస్టులు చాలా తక్కువ సమయంలోనే భర్తీ చేయబడ్డాయి. అయితే జూనియర్ అసిస్టెంట్ (గ్రేడ్-II) పోస్టుల భర్తీ మాత్రం నిలిపి వేయబడిందని సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోళ్ల రమేశ్ అన్నారు. మంగళవారం సింగరేణి సంస్థ మేనేజింగ్ అండ్ డైరెక్టర్ బలరాం నాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పోస్టులను ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ఈ పోస్టులు భర్తీ చేయడం వల్ల అనేకమంది కొత్తగా చేరిన అర్హతలు కలిగిన గిరిజన ఉద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వాస్తవానికి గిరిజన అభ్యర్థులు ఓపెన్ కాంపిటిషన్ ద్వారానే కాకుండా 10 శాతం రిజర్వేషన్ కోటా ద్వారానూ ఈ పోస్టుల్లో పెద్ద ఎత్తున ఎంపిక కావడానికి బలమైన అవకాశమే ఉంది కావునా ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు అభ్యర్థించారు. సింగరేణి సీఎండీని కలిసిన వారిలో ప్రధాన కార్యదర్శి భూక్య కృష్ణమూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వాంకుడోత్ శివ, సుమన్, అండర్ మేనేజర్, మందమర్రి ధరావత్ రమేశ్, భూపాలపల్లి ఉన్నారు.