సిటీ బ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): నల్లా బిల్లు చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని వచ్చే తప్పుడు మెసేజ్‌లకు వినియోగదారులు స్పందించవద్దని జలమండలి సూచించింది. గుర్తుతెలియని వారు అలాంటి తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దని జలమండలి అధికారులు శనివారం ఒక ప్రకటనలో సూచించారు.
వివిధ మొబైల్ నంబర్ల నుంచి.. గతనెల బిల్లు చెల్లించకుంటే మీ నల్లా కనెక్షన్లు తొలగిస్తామని, మరిన్ని వివరాల కోసం మరో మొబైల్ నంబర్‌ను సంప్రదించాలని పేర్కొంటున్నారు. ఆ నంబర్‌ను సంప్రదించగానే ప్రాసెసింగ్ కోసమని ఏపీకే ఫైల్‌ను వాట్సాప్ ద్వారా పంపిస్తున్నట్లు పేర్కొంది. అలాంటి ఫైల్స్ డౌన్లోడ్ చేయకూడదని.. జలమండలి అన్నిరకాల సమాచారాలను అధికారికంగా న్యూస్ పేపర్లు, టీవీల ద్వారానే జారీ చేస్తుందని స్పష్టం చేసింది. ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313ని సంప్రదించాలని కోరింది.