చండ్రుగొండ, నవంబర్ 22 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండల కేంద్రంలోని శ్రీనగర్ కాలనీ (ఉత్తర పొంటు కాలనీ) లో నూతనంగా వైన్ షాప్ ఏర్పాటు చేసేందుకు యజమాని ప్రయత్నిస్తున్నాడని, వైన్ షాప్ ఏర్పాటు చేయొద్దని కోరుతూ కాలనీవాసులు కొత్తగూడెం ఎక్సైజ్ శాఖ అధికారులకు శనివారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. శ్రీనర కాలనీకి వెళ్లేందుకు సింగిల్ రోడ్డు మాత్రమే ఉన్నదని, ఈ రోడ్డు వెంబడి మద్యం షాపు ఏర్పాటు చేయడం వల్ల మహిళలు, విద్యార్థులు, రైతులు నిత్యం అటుగా వెళ్లాల్సి వస్తుందన్నారు. దీంతో మద్యం ప్రియుల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
చండ్రుగొండ గ్రామానికి వెళ్లే రహదారి వెంట మద్యం షాపు ఉండటం వల్ల తరచూ వివాదాలు, గొడవలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. మహిళలు, విద్యార్థులు, వృద్ధులు నిత్యం రహదారి వెంబడి వచ్చి వెళ్తుంటారని తమకు చెడ్డ పేరు తీసుకువచ్చే మద్యం షాపుని ఊరికి దూరంగా పెట్టాలన్నారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనగర్ కాలనీవాసులు లక్ష్మణ్, పున్నమయ్య, రాము, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, సత్యం, సందీప్ పాల్గొన్నారు.