చిట్యాల/చేగుంట, నవంబర్ 22: రాష్ట్రంలో అప్పుల బాధ భరించలేక ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి, మెదక్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లికి చెందిన అబ్బెంగుల రవీందర్(45)కు మూడెకరాల వ్యవసాయ భూమి ఉన్నది.
వరి, పత్తి, మిర్చి సాగు చేశాడు. రెండేండ్లుగా దిగుబడులు సరిగా రాక, రూ.6 లక్షలకుపైగా అప్పులయ్యాయి. మనస్తాపానికి గురైన రవీందర్ 7న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే వరంగల్లోని ఎంజీఎం దవాఖానలో చేర్పించగా, చికిత్స పొందుతూ రవీందర్ శుక్రవారం రాత్రి మృతి చెందాడు.
మెదక్ జిల్లా నార్సింగికి చెందిన రైతు ఎర్లముల మధు(40) కూలీ పనితోపాటు తనకున్న భూమిలో వ్యవసాయం చేసేవాడు. ఇంటి మరమ్మతులతోపాటు వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎక్కువయ్యాయి. శనివారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య శ్యామల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.