పినపాక, నవంబర్ 21: జనగణన ప్రీ సర్వే వివరాలన్నీ పూర్తిస్థాయిలో గోప్యంగా ఉంటాయని, దీనిపై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని సెన్సెస్ ఆఫ్ డైరెక్టర్ భారతి హోలికేరి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో జనగణన సర్వే ఎన్యూమరేటర్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2027లో జాతీయ స్థాయిలో జరగనున్న జనగణనకు ఇప్పుడు నిర్వహిస్తున్న ప్రీ జనగణన ఒక ఎక్సర్సైజ్ లాంటిదని, ఇందులో ఎలాంటి తప్పులు దొర్లకుండా సర్వే నిర్వహించినట్లయితే జాతీయ స్థాయి జనగణనలో సర్వే సులభతరం అవుతుందన్నారు. మండలంలోని ఏడు రెవెన్యూ గ్రామాల్లో కొనసాగుతున్న సర్వేను ఈ నెల 30 వరకు ఎన్యూమరేటర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా, ఎన్యూమరేటర్లకు సర్వేలో తలెత్తిన సమస్యలకు ఆమె పరిష్కార మార్గాలు చూపించారు.
ఏడు రెవెన్యూ గ్రామాల్లో 44 మంది ఎన్యూమరేటర్లు, ఏడుగురు సూపర్వైజర్లతో నిర్వహిస్తున్న జనగణన సర్వే పక్కాగా ఉండాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 నుంచి 200 ఇండ్లు కేటాయించామని, కుటుంబ వివరాలన్నీ డిజిటల్ లే అవుట్, ఇండ్ల జాబితాలలో నమోదు చేయాలని సూచించారు. ఆర్టీఐ ద్వారా కూడా ఈ సమాచారాన్ని ఎవరూ సేకరించలేరన్నారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆర్.శేఖర్, డిప్యూటీ డైరెక్టర్ సుబ్బరాజు, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంఈవో నాగయ్య, సెన్సెస్ ఆఫీసర్లు సతీశ్, హిమవర్ష, వినయ్ తదితరులు పాల్గొన్నారు.