ఖమ్మం రూరల్, నవంబర్ 22 : చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో అక్టోబర్ 31వ తేదీన హత్యకు గురైన సీపీఎం రాష్ట్ర నాయకుడు సామినేని రామారావు హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేశ్ పోలీసులను డిమాండ్ చేశారు. ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్ లో సీపీఎం ఖమ్మం రూరల్ మండల విస్తృతస్థాయి సమావేశం తోట పెద్ద వెంకటరెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో బండి రమేశ్ మాట్లాడుతూ.. సామినేని రామారావు హత్య జరిగి 23 రోజులు అవుతున్నా నిందితులను అరెస్ట్ చేయకపోవడం హేయమైన చర్య అన్నారు. హత్య కేసులో ఎటువంటి పురోగతి లేకుండా వ్యవహరిస్తూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరిగా పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రామారావు హత్య కేసులో కాంగ్రెస్ నాయకులను తప్పించేందుకు కాలయాపన చేస్తున్నారన్నారు.
రామారావు సతీమణి స్వరాజ్యం ఫిర్యాదు చేసిన నిందితులపై ఎటువంటి విచారణ జరగకపోవడం భాదకరమన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి హత్య కేసులో నిందితులను వెంటనే రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు. సామినేని రామారావు హత్యను నిరసిస్తూ ఈ నెల 25న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని మండల ప్రజలను ఆయన కోరారు. హత్యలతో కమ్యూనిస్టులను అడ్డుకోవాలని చూస్తే అంతే వేగంతో ముందుకు వస్తామని హెచ్చరించారు. కమ్యూనిస్టు నాయకులను హత్య చేసి తమ పబ్బం గడుపుకునేందుకు అధికార పార్టీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సామినేని రామారావు హత్యను నిరసిస్తూ లౌకిక శక్తులు, ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరై ధర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి ఉరడీ సుదర్శన్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు నండ్ర ప్రసాద్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పొన్నెకంటి సంగయ్య, నందిగామ కృష్ణ, వడ్లమూడి నాగేశ్వరరావు, నాయకులు యామిని ఉపేందర్, నాగేశ్వరరావు, రామయ్య, కరుణాకర్, అర్వపల్లి శ్రీను, వైకుంఠం, వై.ప్రసాదరావు, పొన్నం వెంకటరమణ, నరేశ్, గురవయ్య, చావా నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, నారాయణరావు, లాల్ బాబు, మురళి, కృష్ణారెడ్డి, నాగయ్య, భాస్కర్, ఆంటోనీ, శ్రీనివాసరావు, వర కుమార్, పల్లె శ్రీనివాసరావు, రాంబాబు, యాదగిరి పాల్గొన్నారు.