కొత్తగూడెం : అవకాశాలను అందిపుచ్చుకోని ఉన్నతస్థాయికి చేరుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖాధికారి(డీఆర్డీఓ) జి.మధుసూదనరాజు అన్నారు. మంగళవారం డీఆర్డీఏ ఆధ్వర్యంలో జియో కార్పొరేట్ కంపెనీ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటీవ్ (వర్క్ ఫ్రం హోం)ఉద్యోగాల ఇంటర్వ్యూల కోసం నిర్వహించిన జాబ్‌మేళా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఉద్యోగం చిన్నదా? పెద్దదా? అనేది ఆలోచించకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని అంచెలంచెలుగా ఎదగాలని సూచించారు.
కమ్యూనికేషన్ స్కిల్స్‌పై పట్టు సాధించాలని స్కిల్స్ ఉంటే ఏ కంపెనీలో అయిన ఉద్యోగం పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ జాబ్ మేళాకు వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 311మంది హాజరుకాగా 55మందిని ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ(జాబ్స్) వెంకయ్య, కంపెనీ హెచ్ఆర్ కిరణ్, సిబ్బంది కిరణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.