– బీఆర్ఎస్ బూర్గంపహాడ్ మండలాధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి
బూర్గంపహాడ్, మార్చి 14 : ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఐటీసీ అధికారులు మాత్రం ప్రోటోకాల్ విషయంలో అందరినీ ఒకేలా గుర్తించాలని బీఆర్ఎస్ బూర్గంపహాడ్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ విషయంలో ఐటీసీ అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడం సిగ్గుచేటన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఐటీసీ అధికారులతో చర్చలు జరిపి రూ.50 లక్షలు సైడ్ డ్రైన్ నిర్మాణాల కోసం సీఎస్ఆర్ నిధులు తీసుకు వస్తే బీఆర్ఎస్ సర్పంచ్ అనే ఉద్దేశ్యంతో శంకుస్థాపన కార్యక్రమానికి సర్పంచ్, పాలకవర్గానికి ఆహ్వానం లేకపోవడం అధికార పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే సైతం కనీసం ప్రోటోకాల్ పాటించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పంచాయతీకి ప్రథమ పౌరురాలైన సర్పంచ్‌ను ఆహ్వానించకుండా ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇకనైనా ఐటీసీ అధికారులు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రోటోకాల్ విషయంలో వారి గౌరవాన్ని కాపాడాలని, మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని హితవు పలికారు.