– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవ
చుంచుపల్లి, మే 15 : చుంచుపల్లి మండలం పెనగడప– రాంపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెలరోజులుగా రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం అత్యంత దారుణమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు శుక్రవారం ఆయన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడి రైతులకు ఎలాంటి తరుగు లేకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు రైతులను కొనుగోలు కేంద్రాల వద్ద నెలల తరబడి వేచి ఉండే పరిస్థితికి తీసుకువచ్చిందని దుయ్యబట్టారు. వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులకు తగిన రక్షణ చర్యలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు కూడా అందుబాటులో లేవని, వెంటనే రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని అధికారులను కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో ఇదే పరిస్థితి నెలకొన్నదన్నారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. “వర్షాలు పడితే తమ పరిస్థితి ఏమవుతుంది” అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారని, కొంతమంది ఆత్మహత్యల దిశగా ఆలోచించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యంలో తాలు ఉందని, రంగు మారిందని నాణ్యతా లోపాలు చూపిస్తూ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. సొసైటీ అధికారులు, సెక్రటరీలు, ప్రెసిడెంట్లు రైతుల సమస్యలపై స్పందించడం లేదని ప్రశ్నించారు. వెంటనే తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
వారం రోజుల్లో కొత్తగూడెం సహా ఇతర ప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఎక్కువ చేసి చేతల్లో మాత్రం విఫలమవుతోందని, అంకెల గారడీతో కాలం గడుపుతోందని విమర్శించారు. పిఆర్ రకాలకు సంబంధించిన ధాన్యాన్ని కూడా తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, మాజీ ఉర్దూగర్ చైర్మన్ అన్వర్, యూత్ ప్రెసిడెంట్ కన్నీ, చుంచుపల్లి మండల మైనార్టీ అధ్యక్షులు ఎస్.కె హైమద్, పార్టీ నాయకులు నవనతన్, రుక్మాధర్, ప్రసాద్, పాష, జగన్, పెనగడప వార్డు మెంబర్ ఎండి ఆఫీసర్ బేగం అచ్చా నరేందర్, మహేష్ , ఎస్ కె యాకుబ్ పాషా పాల్గొన్నారు.

‘నెల రోజులైనా ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణం’