చుంచుపల్లి, జూన్ 26 : వర్షాకాలం ప్రారంభమైన వేళ చెరువుల్లో నీటిని నిల్వ చేసి రైతులకు సాగునీరు అందించాల్సిన సమయంలో చెరువుల తూముల షట్టర్లు పాడైపోయినా ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెనగడపలోని కృష్ణారాయుడు చెరువు, ఎర్ర చెరువు, పెద్ద చెరువు కింద సుమారు 900 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. ఈ మూడు చెరువుల నుండే ప్రతి ఏడాది రెండు పంటలకు సాగునీరు అందుతుండడంతో పాటు భూగర్భ జలాలు కూడా సమృద్ధిగా నిల్వ ఉండి బోర్లు, మోటార్లకు నీరు లభిస్తుందని రైతులు చెబుతున్నారు. అయితే కొన్ని నెలలుగా ఈ మూడు చెరువుల తూముల షట్టర్లు పూర్తిగా దెబ్బతినడంతో చెరువుల్లో నీటిని నిల్వ చేయడం కష్టంగా మారిందని, వర్షపు నీరు వృథాగా పోతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత చర్యలు చేపట్టలేదని రైతులు విమర్శిస్తున్నారు.
ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులు కూడా ధృవీకరించారు. షట్టర్ల మరమ్మతుల కోసం రూ.1.10 లక్షల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో పనులు నిలిచిపోయాయని చెబుతున్నారు. అదే విధంగా ఇది సింగరేణి ప్రభావిత ప్రాంతం కావడంతో జీకేఓసీ (GK OC) నుండి విడుదల చేసే నీటిని కూడా ఈ చెరువుల్లోకి మళ్లిస్తుంటారు. షట్టర్ల సమస్యపై సింగరేణి అధికారులు కూడా పలుమార్లు ప్రస్తావించినట్లు ఇరిగేషన్ ఏఈ ప్రసాద్‌రావు తెలిపారు. అయితే అధికారులు టెండర్ల పేరుతో కాలయాపన చేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకుని తక్షణమే షట్టర్ల మరమ్మతులు పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ స్పందించి చెరువుల్లో నీరు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టకపోతే రాబోయే సాగు సీజన్లో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెనగడప చెరువు షట్టర్ల మరమ్మతులపై ఇరిగేషన్ అధికారుల అలసత్వం