కొత్తగూడెం సింగరేణి( ఏప్రిల్ 15): ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నిర్వహిస్తున్న హైకోర్టు స్కిల్ టెస్టింగ్ పరీక్షల్లో నిర్వాహకులు నిర్లక్ష్యంగావ్య వహరించడంతో అభ్యర్థులకు రెండు నిమిషాలు ఆలస్యంగా పేపర్ ఇచ్చారు. వివరాల్లోకెళ్తే హైకోర్టు కాపిస్టు ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను ఆనందరావు ప్లాజాలోగల అయాన్ డిజిటల్ జోన్ ఐడిఎన్ నిర్వహించారు. ఉదయం 7:30నిమిషాలకు రిపోర్టు చేసిన అభ్యర్థులకు 9 గంటల నుంచి 9:50 గంటల వరకు పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అర్ధగంట ప్రాక్టీస్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు ఆ తర్వాత ఐదు నిమిషాలు రిలాక్సేషన్ అనంతరం కేవలం పదినిమిషాలు మాత్రమే టైపింగ్ చేయాల్సి ఉంటుంది. టైం గడిచినప్పటికీ నిర్వాహకులు పేపర్ ఇవ్వకపోవడం వల్ల అభ్యర్థులు వెళ్లి అడగగా రెండు నిమిషాలు ఆలస్యంగా పేపర్ అందించినట్లు అభ్యర్థులు వాపోతున్నారు.
పదినిమిషాల సమయంలో రెండు నిమిషాలు విలువైనది కావున రెండు నిమిషాల సమయం తిరిగి ఇచ్చేందుకు మళ్లీ స్కిల్ టెస్టింగ్ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఉద్యోగాల కోసం వచ్చిన అభ్యర్థులు పరీక్ష నిర్వాహలతో వాగ్వివాదానికి దిగారు. నిర్వాహకుల నిర్లక్ష్యంతో సుమారు 200 మంది అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని వీరికి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పేర్లు నమోదు చేసుకొని మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని నోటిమాట ద్వారా తెలియజేశారు. లిఖితపూర్వకంగా హామీ ఇవ్వలేదని అభ్యర్థులు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతి పరీక్షల్లో, సంక్షేమ పథకాల్లో అవకతవకలు జరగడం మామూలేనని తమకు న్యాయం జరగదని అభ్యర్థులు నిరాశతో వెను తిరిగారు.