– టీబీజీకేఎస్ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ
రామవరం, జనవరి 20 : సింగరేణిలో ‘సైట్ విజిట్’ దందాపై సమగ్ర విచారణ చేపట్టాలని టీబీజీకేఎస్ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం టీబీజీకేఏస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో సైట్ విజిట్ దందాకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుందని విమర్శించారు. ఇది కాంగ్రెస్ సర్కార్‌కు బంగారు బాతుగా మారిందన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ క్లాజ్ ఇప్పుడు దేశీయ బొగ్గు పరిశ్రమలోనే అతిపెద్ద కుంభకోణానికి కేంద్ర బిందువుగా మారిందన్నారు. ఇది కేవలం ఒక నిబంధన కాదని, తమకు కావాల్సిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు గీసిన ఒక మాస్టర్ స్కెచ్ అన్నారు.
సాధారణంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో మట్టి తొలగింపు పనులకు టెండర్లు పిలిచినప్పుడు సాంకేతిక, ఆర్థిక అర్హతలే ప్రామాణికంగా ఉంటాయన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రామగుండం ఓసీపీ నుంచి మొదలుపెట్టి, నైనీ ఎండిఓ టెండర్, తాజాగా మణుగూరు పీకే ఓసీపీ వరకు ప్రతిచోటా ఈ ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ క్లాజును అస్త్రంగా వాడుకుంటోందని ఆరోపించారు. నిబంధనల ప్రకారం టెండర్ వేసే కంపెనీ ప్రతినిధి ముందుగా గనిని సందర్శించి, అక్కడి అధికారుల నుండి సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుందని తెలిపారు. అసలు తిరకాసు ఏమిటంటే ఏ కంపెనీకి సర్టిఫికేట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది పూర్తిగా అధికారుల (లేదా వారి వెనుక ఉన్న రాజకీయ నేతల) చేతుల్లోనే ఉంటుందని వివరించారు. తమకు ‘నజరానాలు’ అర్పించిన కంపెనీలకే గేట్ పాస్ ఇచ్చి, మిగిలిన హేమాహేమీ కంపెనీలను టెండర్ ప్రక్రియ నుండే తప్పిస్తున్నారని విమర్శించారు. అందుకే దీనిని కాంగ్రెస్ నేతల ‘గోల్డెన్ డక్’ గా అభివర్ణించక తప్పదన్నారు.
నైనీ ఎండిఓ టెండర్ విషయంలో కాంగ్రెస్ గ్రూపుల మధ్య ‘వాటాల’ యుద్ధంగా మారిందన్నారు. ఒడిశాలోని నైనీ బొగ్గు గని ఎండిఓ టెండర్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలను రోడ్డున పడేసిందని వ్యాఖ్యానించారు. ముఠా తగాదాలుగా మారిన ఈ వేల కోట్ల కాంట్రాక్టును తమ అనుచరులకు ఇప్పించుకునే క్రమంలో ఇద్దరు కీలక మంత్రుల వర్గాల మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొందన్నారు. ఫియాస్కో లో ఒక వర్గం చక్రం తిప్పాలని చూస్తే, వాటా దక్కని మరో వర్గం ఈ స్కామ్‌ను బయట పెట్టిందన్న సమాచారం బహిరంగంగానే వినిపిస్తుందన్నారు. ఈ ‘ఎండిఓ టెండర్’ గొడవ కారణంగానే చివరకు ప్రభుత్వం దిగివచ్చి టెండర్లను రద్దు చేయాల్సి వచ్చిందన్నారు.
బీజేపీ మౌనం వెనుక లోపాయికారీ ఒప్పందం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఏ చిన్న అవకాశం దొరికినా విరుచుకుపడే బీజేపీ, ఇంతటి భారీ కుంభకోణంపై ఎందుకు మౌనంగా ఉందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ పరిధిలో ఉన్న అంశం కావడంతో బీజేపీ మౌనం అనేక అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని, సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణం తీవ్రత దృష్ట్యా ప్రతిపక్షాలు, విశ్లేషకులు పలు విధాలుగా ప్రశ్నలు ప్రభుత్వం ముందు ఉంచాయన్నారు. శ్వేతపత్రం ఇవ్వాలని, రామగుండం నుండి మనుగూరు వరకు జరిగిన 4-5 ప్రధాన టెండర్లలో ఎవరెవరికి ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ ఇచ్చారో సింగరేణి మేనేజ్మెంట్ శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సీబీఐ/సిట్ చే దర్యాప్తు దర్యాప్తు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేసే సిట్ పై నమ్మకం లేదని, కేంద్ర సంస్థ అయిన సీబీఐ లేదా హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, టెండర్ల నిబంధనలను మార్చిన అధికారులు, వారిని ప్రభావితం చేసిన రాజకీయ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కూసన వీరభద్రయ్య, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాస్, కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, సెంట్రల్ కమిటీ సభ్యులు బోరింగ్ శంకర్, అరుణ్, పిట్ సెక్రటరీ సూరజ్, వెంకటేశ్వర్లు, రాంబాబు, అమరేందర్, అనుదీప్, రాజేశ్, అన్వర్, లక్ష్మయ్య పాల్గొన్నారు.