బూర్గంపహాడ్, ఏప్రిల్ 13 : బూర్గంపహాడ్ మండలం సారపాకలోని ఐటీసీ కర్మాగారంలో జరుగుతున్న 14వ వేతన ఒప్పందం జాప్యంపై ఐఎన్టీయూసీ మిత్రపక్షాలు వరంగల్ లోని లేబర్ జాయింట్ కమీషనర్ (జేసీఎల్) కార్యాలయంలో సోమవారం సూపరింటెండెంట్ గౌతమికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ఐటీసీ పరిశ్రమలో కార్మికుల విషయంలో అటు గుర్తింపు సంఘం ఇటు ఐటీసీ యాజమాన్య నిర్లక్ష్య ధోరణి కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తుందన్నారు. యాజమాన్యం గుర్తింపు సంఘంతో గత ఆరు నెలల నుంచి 14వ వేతన ఒప్పందంపై చర్చలు సాగిస్తున్నా ఉత్పత్తి 70 వేల టన్నుల నుంచి 8 లక్షల టన్నులకు పెరిగినా కార్మికుల జీవన ప్రమాణాలు ఏ మాత్రం మెరుగు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గత 13, ప్రస్తుత 14వ వేతన ఒప్పందం ప్రస్తుత గుర్తింపు సంఘం చేస్తున్నా కార్మికులకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడం వారి వైఫల్యానికి నిదర్శనమన్నారు. ప్రతి కార్మికుడికి రూ.22 వేలు పెంపు సాధిస్తామని, 100 శాతం అన్లిమిటెడ్ మెడికల్ సౌకర్యం కల్పిస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.12 లక్షలు సాధిస్తామని, పరిశ్రమ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 10 గ్రాముల గోల్డ్ కాయిన్ గిఫ్ట్ సాధిస్తామని, శ్రీరామ నవమికి పెయిడ్ హాలిడే సాధిస్తామని, మ్యాన్ పవర్ తగ్గించకుండా, రిక్రూట్మెంట్ విధానం ఈఎస్పీ బదిలీ-ఎంప్లాయ్ అయ్యేలా అగ్రిమెంట్ చేస్తామని, వీడీఏ పాయింట్‌కు రూ.6 చొప్పున పెంపు చేస్తామని హామీలు ఇచ్చి కార్మికులతో ఓట్లు వేయించుకుని గెలిచి ఆ హామీలను మరిచి ఆరునెలలుగా వేతన ఒప్పందంలో జాప్యం వహిస్తున్నారని మండిపడ్డారు.
ప్రస్తుతం ఐటీసీ యాజమాన్యం నష్టాల్లో ఉందని కుంటిసాకులు చెబుతూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. మరోవైపు కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు, కాంట్రాక్టు కార్మికులు 19 రోజులుగా దీక్షలు చేస్తున్నా వారి సమస్యలను పట్టించుకోకుండా యాజమాన్యం ఒంటెద్దు పోకడలకు పోతుందని మండిపడ్డారు. యాజమాన్యం కార్మికులను పట్టించుకోకుంటే రేపో మాపో కార్మికులు సమ్మెబాట పట్టే అవకాశం లేకపోలేదని ఆ వినతిలో పేర్కొన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఐఎన్టీయూసీ మిత్రపక్షాల నాయకులు వినోద్, సలీమ్, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సాయిరాం, కూచిపూడి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.