రుద్రంపూర్, సెప్టెంబర్ 16 : రుద్రంపూర్ ఎస్ఆర్టీ ఏరియాలో పగిలిపోయిన తాగునీటి పైప్‌లైన్ మరమ్మతు పనులను సింగరేణి కొత్తగూడెం ఏరియా సివిల్ విభాగం అధికారులు ముమ్మరంగా చేపట్టారు. గత కొన్ని రోజులుగా పైప్‌లైన్ పగిలిపోవడంతో కాలనీల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన బీడ్ పైప్‌లైన్ చెట్లు పడటంతో పగిలిపోయినట్లు అధికారులు గుర్తించారు. సమస్యను పరిశీలించిన అనంతరం పగిలిన పైపులను తొలగించి, వాటి స్థానంలో జీడీపీ పైపులను అమర్చే పనులను కాంట్రాక్ట్ వాటర్ సప్లై కార్మికులతో ప్రారంభించారు. క్లిష్టతరమైన జాయింటింగ్ పనులను సైతం కార్మికులు సమయస్ఫూర్తితో చేపడుతూ నీటి సరఫరా పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు.
సివిల్ విభాగం ఈఈ సుమంత్, వాటర్ సప్లై సూపర్వైజర్ గూడెల్లి యాకయ్య ఆధ్వర్యంలో పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే నాల ఏరియా పైప్‌లైన్ పునరుద్ధరణ పనులు పూర్తిచేసి నీటి సరఫరాను ప్రారంభించారు. ప్రస్తుతం గోపి ఏరియా కాలనీకి సంబంధించిన పైప్‌లైన్ పనులను చేపడుతున్నారు. సాయంత్రం నుంచి కాలనీకి నీటి సరఫరా పునరుద్ధరించడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. పగిలిన పైప్‌లైన్‌ను తొలగించి కొత్త పైపులను అమర్చడం, జాయింటింగ్ పనులు పూర్తిచేయడం వంటి క్లిష్టమైన పనులను వేగంగా చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించిన వాటర్ సప్లై కార్మికులకు కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు.