మాగనూరు : మండలంలోని ప్రజా సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలు చూపాల్సిన మాగనూరు ( Maganur ) మండల సర్వసభ్య సమావేశం నామమాత్రంగా సాగిందని ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సమావేశానికి కీలక శాఖల అధికారులు గైర్హాజరు కావడంతో ప్రజా సమస్యల పై సమగ్రంగా చర్చించే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడం, ఉన్న సౌకర్యాలు కూడా సక్రమంగా లేకపోవడంపై ఎంఈవో( MEOs ) ను నిలదీశారు. విద్యార్థులు అధికంగా ఉన్న పాఠశాలల్లో అవసర మైన అదనపు బోధనా సిబ్బంది, విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న తరగతుల్లో బోధనా సిబ్బంది కొరత ఉంటే విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. మండలంలో తరచూ విద్యుత్ కోతలు విధించడంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలకు సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.