బూర్గంపహాడ్, ఏప్రిల్ 23 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని కృష్ణసాగర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఉపాధి పనులతో పాటు నర్సరీని సర్పంచ్ తాటి వాణి, ఉప సర్పంచ్ మోహన్రావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి పనులు చేస్తున్న పనుల ప్రదేశం వద్దకు వెళ్లి కూలీలకు మంచినీటి క్యాన్లు, మెడికల్ కిట్లను అందజేశారు. పనుల ప్రదేశంలో వారికి ఎండ తగలకుండా టెంట్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉపాధి సిబ్బందికి సూచించారు. అనంతరం గ్రామంలో మొక్కల నర్సరీని సందర్శించి మొక్కలను సంరక్షించి పెంపకంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కృష్ణసాగర్ ఎస్టీ కాలనీలో ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించి పిల్లలకు నాణ్యమైన విద్యాబోధన చేయాలని హెచ్ఎం కోటేశ్వరరావుకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగిరెడ్డి, పాలకవర్గ సభ్యులు ఉసిల్ల రాజేష్, అంతోటి కృష్ణలీల, బాదావత్ సురేష్, మడకం దేవయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ భూక్యా హనుమంతరావు, ఉపాధ్యాయులు భీమయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.