ఇల్లెందు, సెప్టెంబర్ 18 : ఇల్లెందు పోలీస్ డివిజన్ పరిధిలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. గురువారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధి 22వ వార్డు వినోబా భావే కాలనీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇల్లెందు సీఐ తాటిపాముల సురేశ్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ.. కార్డెన్ సెర్చ్ లో దాదాపు 70 పైగా ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, రెండు కార్లను తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. ఎటువంటి నమోదు కాగితాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు వెల్లడించారు.
అదేవిధంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ఇల్లెందులో అనుమానిత వ్యక్తులు కనబడితే సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, ట్రాఫిక్ అవేర్నెస్, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు, వాహనాలు ఇన్సూరెన్స్ చేయించుకోకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి స్థానిక యువతకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్ఐలు హసీనా, సూర్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.