భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 19 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సమగ్రమైన ప్రణాళికతో అమలు చేయాలని, అర్హత కలిగిన మహిళందరికీ అందేలా చూడాలని అన్ని శాఖల అధికారులను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులకు తగు సూచనలు చేశారు. పంపిణీ కేంద్రాల్లో భౌతిక ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణ, రశీదుల యాజమాన్యం పూర్తిగా పారదర్శకంగా ఉండాలన్నారు. మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రత్యేక కౌంటర్లు, సిబ్బందిని ఏర్పాటు చేయాలని, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాలతో సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 19 నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు, అదే పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుండి 8వ తేదీ వరకు పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సెర్ప్ అధనపు డీఆర్డీఓ నీలేశ్, డీపీఓ అనూష, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ సుజాత, ఇల్లెందు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, అశ్వరావుపేట మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.అనంతరం ‘జల్ సంచయ్ – జన్ భాగీదారీ’ కార్యక్రమంలో జిల్లా సాధించిన జాతీయ అవార్డు సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనను సత్కరించారు.

Bhadradri Kothagudem : ఇందిరమ్మ చీరలు అర్హులందరికీ చేరేలా చూడాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్