కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 28 : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో ఉన్న నిరుపేదలు 807 మందికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 75 గజాల చొప్పున ఇంటి స్థలం ఇచ్చింది. ఆ లబ్ధిదారులకు ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని ”సేవ్ కొత్తగూడెం- సేవ్ మున్సిపాలిటీ” కన్వీనర్ జలాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం లబ్దిదారులతో కలిసి మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ కమిటీల్లో మాజీ కౌన్సిలర్ల పెత్తనం ఎక్కువైందని, లబ్ధిదారులకు అన్యాయం చేయాలని కొంతమంది నాయకులు చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనర్హులకు ఇండ్లు ఇస్తే అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏ వార్డులో ఎంతమందికి ఇండ్లు వచ్చాయో సవివరంగా మున్సిపల్ నోటీసు బోర్డులో పెట్టాలని, ఇండ్ల ఎంపికలో మాజీ కౌన్సిలర్ల ప్రాధాన్యత అస్సలు ఉండకూడదని ఆయన అధికారులను కోరారు.
ఇందిరమ్మ కమిటీ సభ్యులు సైతం లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాలని లేని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో రామవరం ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, వారికి ఎలాంటి హక్కు పత్రాలు లేకపోవడంతో ఇండ్లు మంజూరయ్యే అవకాశం కనబడడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగూడెం పట్టణంలో సైతం స్థలాలకు అతి తక్కువ మందికి పట్టాలు ఉండడంతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తీవ్ర అన్యాయం జరగనున్నట్లు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే అర్హులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జిల్లా కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణలో చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల లబ్దిదారులు పాల్గొన్నారు.