– రాష్ట్ర వ్యవసాయం, గ్రామీణ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్
జూలూరుపాడు, మే 29 : రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని తెలంగాణ వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూలూరుపాడు మండలం రామచంద్రాపురం గ్రామంలో తెలంగాణ వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం 7వ మండల మహాసభ పెరుమాళ్ల వెంకటేశ్వర్లు, పద్దం సుగుణ సంయుక్త అధ్యక్షతన శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభల ప్రారంభ సూచికగా సంఘం జెండాను సీనియర్ నాయకులు కొడెం బక్కులు ఆవిష్కరించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ మాట్లాడుతూ.. దోపిడీకి వ్యతిరేకంగా, పేదల హక్కుల కోసం నడిచిన పోరాటాల చరిత్రను స్మరించుకున్నారు.
1936వ సంవత్సరంలో అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించారని, ఆ స్ఫూర్తితో పోరాటాల పురిటిగడ్డ అయిన జూలూరుపాడులో అమరజీవి కాసాని అయిలయ్య సంఘాన్ని బలోపేతం చేశారని కొనియాడారు. ఆనాడే కూలి సంఘం ఆధ్వర్యంలో జీతగాళ్ల సంఘాన్ని ఏర్పాటు చేసి దోపిడీపై రాజీలేని పోరాటం చేశారన్నారు. సాగు భూములు పేదలందరికీ దక్కాలనే లక్ష్యంతో నిరంతరం భూ పోరాటాలు నడిపిన ఘనత తెలంగాణ వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘానిదేనని స్పష్టం చేశారు. మండల పరిధిలో గతంలో జరిగిన చొప్పకట్టల పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందన్నారు.
మహాసభల ముగింపు సందర్భంగా జూలూరుపాడు మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల నూతన అధ్యక్షుడిగా యాసా నరేష్, కార్యదర్శిగా రాచబంటి కోటేశ్వరరావు, మండల మహిళా కన్వీనర్‌గా పద్దం సుగుణ ఎన్నికైనట్లు జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ అధికారికంగా ప్రకటించారు. ఈ మహాసభలో నూతన కమిటీ సభ్యులు పెరుమాళ్ళ వెంకటేశ్వర్లు, ఇల్లంగి సీతారాములు, తోలెం సరస్వతి, గుగులోత్ నర్సింహారావు, తాటి కృష్ణవేణి, బానోత్ కృష్ణ, ఊడల వెంకటేశ్వర్లు, తాటి ఇందిర, వేముల ఉపేందర్, ఎలగల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.