– బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు
జూలూరుపాడు, జూన్ 11 : ఖమ్మం నగరంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అమానుష ఘటనను బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు తీవ్రంగా ఖండించారు. జూలూరుపాడు మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు ఏ రాజకీయ పార్టీకి చెందినవాడైనా శిక్షించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. నిందితుడిని రక్షించేందుకు, దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు, బాధిత కుటుంబంపై ఒత్తిడి తీసుకురావడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తే వారు ఎంతటి వారైనా సరే కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సంఘీభావం ప్రకటించిన ఆయన ఆ చిన్నారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు, కుటుంబానికి పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బాధితురాలికి సంపూర్ణ న్యాయం జరిగే వరకు ప్రభుత్వం, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు అత్యంత జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.