హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31(నమస్తే తెలంగాణ): హైడ్రా తీరు చిత్రవిచిత్రంగా ఉన్నది. కొండాపూర్‌లో కూల్చివేత విషయంలో అత్యుత్సాహానికి పోయి.. తప్పులు చేసి రెవెన్యూపై నెపం నెడుతుండటంపై సొంత సిబ్బంది నుంచే విమర్శలు మూటగట్టుకుంటున్నది. హైకోర్టులో విచారణ తర్వాత సమాచారం బయటకు రాగానే అందుకు కౌంటర్‌గా అధికారిక సోషల్ మీడియా ఖాతాలో చేసిన ప్రకటనతో అభాసుపాలవున్నది. కొండాపూర్‌లో జరిగిన కూల్చివేతలకు బాధ్యత రెవెన్యూదేనంటూ శుక్రవారం హైడ్రా ఒక ప్రకటన విడుదల చేసింది. రెవెన్యూ సిబ్బంది చూపిన హద్దుల మేరకే అక్కడ ఫెన్సింగ్ వేశామని అందులో పేర్కొన్నది.
కానీ హైడ్రా అక్కడ కూల్చివేతలు చేసే సమయంలో స్థానికంగా ఆ ఇంట్లో ఉన్నవారు ఎంతగా చెప్పినా వినకుండా ఒంటెత్తు పోకడలకు పోయి ఉన్నపళంగా వారిని బయటకు పంపి ఇంటిని నేలమట్టం చేసింది. అయితే ఇదంతా రెవెన్యూ వాళ్లు చెప్పినట్టే చేశామని చెబుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం తాము సర్వే నంబర్ ఒకటి చెబితే అక్కడ కూల్చివేతలతో పాటు మరో సర్వేనెంబర్లో కూడా కూల్చేశారని తమ ప్రమేయం ఏమీ లేదనడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ పరిధిలోని సర్వే నెంబర్ 60లో తమకు చెందిన 350 గజాల ప్లాట్‌నెంబర్(9/బీ) ప్రైవేట్ భూమిలోకి హైడ్రా అధికారులు అక్రమంగా ప్రవేశించి ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ప్రహరీ కూల్చేశారని పీ సుధారాణి అనే మహిళ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టగా, శేరిలింగంపల్లి తహసీల్దార్ ఆదేశాలతోనే తాము కూల్చివేత చేపట్టామని హైడ్రా పేర్కొన్నది. జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ఆదేశాల మేరకు తహసీల్దార్ విచారణకు హాజరై తాము సర్వే నెంబర్ 59 అని చెబితే, హైడ్రా అధికారులు పిటిషనర్ ప్లాట్ ఉన్న సర్వే నెంబర్ 60లో కూల్చివేతలు చేపట్టారని వివరణ ఇచ్చారు. తహసీల్దార్ ఆదేశిస్తేనే కూల్చేశామంటూ హైకోర్టును తప్పుదోవ పట్టించారని హైడ్రాపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆ తర్వాత హైడ్రా తన అధికారిక సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి, సమాచారం మేరకే తాము సర్వే నంబర్ 59లో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నది. హైకోర్టు తీర్పు ఆధారంగా రెవెన్యూ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకే అక్కడ ఫెన్సింగ్ వేసినట్టు చెప్పింది. ఆర్డీవో, ఎమ్మార్వో, సర్వేయర్లు, ఆర్ఐల సమక్షంలో పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా ఫెన్సింగ్ వేసినట్టు చెప్పారు. సర్వే నంబర్ 60లోకి హైడ్రా వెళ్లలేదని పేర్కొన్నారు. సర్వే నంబర్ 60లో తన ప్లాట్ ఉన్నదని ఆక్రమణలు తొలగించిన తర్వాత కానీ అంతకుముందు కానీ సుధారాణి అనే మహిళ హైడ్రాను సంప్రదించలేదని, హైడ్రాకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు.
రెవెన్యూ అధికారుల సమక్షంలో వారు చూపిన హద్దుల మేరకే హైడ్రా ఫెన్సింగ్ వేసిందని, ఇందులో హైడ్రా స్వతహాగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటనతో హైడ్రా మరోసారి నవ్వులపాలవుతున్నది. తన ప్రకటనలోనే అబద్ధాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని హైడ్రా బాధితులు అంటున్నారు. ముఖ్యంగా హైడ్రా కూల్చివేతలు జరిగిన రోజున హైడ్రా సిబ్బంది వచ్చి సర్వే నంబర్ 60లో ఉన్న సుధారాణి అనే మహిళ ప్లాట్‌లో ఉన్న వాచ్‌మన్ రూమ్, ప్రహరీ కూల్చేసిన దృశ్యాలు ఇప్పటికీ సాక్ష్యంగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా తీసుకోనివ్వకుండా కేవలం 15నిమిషాల వ్యవధిలోనే కట్టుబట్టలతో ఇంట్లో ఉన్నవారిని బయటకు పంపి హైడ్రా చేసిన విధ్వంసం అంతా ఇంతాకాదు. ఆ సందర్భంలో రెవెన్యూ సిబ్బంది చూపించిన హద్దులే అంటూ హైడ్రా చెప్పడం పూర్తిగా అబద్ధమంటూ స్థానికంగా చర్చ జరుగుతున్నది.
నిరుడు అక్టోబర్ 3న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సైబరాబాద్ సీపీకి రాసిన లేఖ ప్రకారం సర్వే నంబర్ 59లో ఉన్న 36 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి అని ఉన్నది. హైడ్రాకు లేఖ ప్రతిని పంపుతున్నామని కూడా అందులో పేర్కొన్నారు. ఆ లేఖలో ఎక్కడా సర్వే నంబర్ 60 ప్రస్తావనే లేదు. కానీ హైడ్రా అత్యుత్సాహంగా 60లో ఉన్న ఆ ఇంటిని కూల్చేసింది. కాగా బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేయలేదంటూ తాజాగా వెలువరించిన ప్రకటన హాస్యాస్పదంగా ఉన్నది. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇల్లు కూల్చేశారంటూ సుధారాణి హైకోర్టుకు తెలిపారు. ఒకవైపు హైకోర్టు హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే హైడ్రా మాత్రం సోషల్‌మీడియాలో కౌంటర్ ప్రకటనలిస్తూ తాను తప్పు చేసి కూడా రెవెన్యూ వారిపై తప్పు నెట్టేయడం ఎంతవరకు కరెక్టని ఓ రెవెన్యూ సీనియర్ అధికారి ప్రశ్నించారు. హైడ్రా వల్ల తమ శాఖకు చాలా సందర్భాల్లో ఇలాంటి సమస్యే తలెత్తుతున్నదని ఆయన చెప్పారు.