బూర్గంపహాడ్, జూలై 29 : బూర్గంపహాడ్ మండలంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. గత రెండు రోజులుగా ఆకాశం మేఘావృతం కావడంతో మంగళ, బుధవారాలు జోరువర్షం పడుతోంది. వాతావరణ శాఖ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని చెబుతుండగా మరోపక్క వరుణుడు కరుణించి ఆగకుండా వర్షం కురిపించడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో చింతా కొండయ్యకు చెందిన ఇంటి గోడ కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ బానోత్ సరోజ కొండయ్య నివాసానికి వెళ్లి పరామర్శించారు.
రానున్న 36 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించడంతో గోదావరి పరివాహక ప్రాంతమైన బూర్గంపహాడ్ మండలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ముంపు ప్రాంతాలను ముందుగానే గుర్తించి సంబంధిత శాఖలు నదులు, వాగులు, చెరువులు, కాలువల వద్దకు వెళ్లకుండా ప్రజలకు తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్ ఇప్పటికే సూచనలు చేశారు. గోదావరి నదికి ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద వచ్చి చేరే అవకాశం ఉందని, ఈ క్రమంలో ముంపు ప్రాంతాలైన బూర్గంపహాడ్, సారపాక, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, ఇరవెండి, మోతే పట్టీనగర్ తదితర గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేసే పనిలో రెవెన్యూ, పోలీస్, మండల పరిషత్ శాఖల అధికారులు నిమగ్నమయ్యారు.