నిషిన్: ఏషియన్ గేమ్స్(Asian Games) టీ20 క్రికెట్లో.. గోల్డ్ మెడల్ మ్యాచ్ కోసం ఇండియా, పాకిస్థాన్ జట్లు శనివారం తలపడనున్నాయి. ఇవాళ జరిగిన సెమీస్‌లో శ్రీలంకపై ఇండియా 124 రన్స్ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇక పాక్ కూడా బంగ్లాపై నెగ్గి ఫైనల్‌కు ప్రవేశించింది. అయితే ఇటీవల ఇండో, పాక్ క్రికెటర్లు.. మ్యాచ్‌కు ముందు కానీ, మ్యాచ్ ముగిసిన తర్వాత కానీ, షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం లేదన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఆపరేషన్ సింధూర్ తర్వాత.. రెండు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం లేదు. ఆసియా కప్, ఐసీసీ ఈవెంట్లలో రెండు జట్లు తలపడ్డా.. క్రికెటర్లు మాత్రం తమ చేతుల్ని కలుపుకోలేదు. ఇక శనివారం మరో సారి ఆ రెండు జట్లు తలపడనున్న నేపథ్యంలో హ్యాండ్‌షేక్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
ఏషియన్ గేమ్స్‌ను ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా నిర్వహిస్తుంది. అయితే ఓసీఏ లేదా ఐఓసీ రూల్స్ ప్రకారం.. ఆటగాళ్లు కచ్చితంగా హ్యాండ్ షేక్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ క్రీడాస్పూర్తిని చాటేందుకు మాత్రం ఆటగాళ్లు కరచాలనం చేస్తుంటారు. 2016 ఒలింపిక్స్‌లో ఈజిప్ట్ జుడోకా ప్లేయర్ ఇస్లామ్ ఎల్ షెహబే .. ఇజ్రాయిలీ అథ్లెట్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అయితే ఆ సమయంలో అతనికి ఐఓసీ జరిమానా విధించలేదు. కానీ క్రీడాస్పూర్తిని దెబ్బతీసినందుకు అతన్ని తీవ్రంగా మందలించింది. అతన్ని టోర్నీ నుంచి మధ్యలోనే ఇంటికి పంపించారు. ఇక ఇటీవల ఉక్రెయిన్ అథ్లెట్లు రష్యా, బెలారస్ ప్రత్యర్థులకు షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు యాజమాన్యం ఎలా వ్యవహరిస్తుందన్న అంశం కీలకంగా మారింది. క్రికెటర్లు షేక్‌హ్యాండ్ ఇవ్వాలా వద్దా అన్న అంశాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తేల్చనున్నారు. ఫైనల్‌ను వీక్షించేందుకు ఆయన నగోయా వెళ్తున్నారు. త్వరలో దీనిపై ఓ నిర్ణయం వెలుబడుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐసీసీ చైర్మెన్ జే షా కూడా ఫైనల్ వీక్షించేందుకు జపాన్ వెళ్తున్నారు.
తాజా గేమ్స్‌లో టెన్నిస్, స్క్వాష్ ఆటగాళ్లు మాత్రం పాక్ ప్లేయర్లతో హ్యాండ్ షేక్ చేశారు.ఫైనల్లో ఇండియా ఓడినా, గెలిచినా.. పోడియంను మాత్రం ఇరు జట్ల ఆటగాళ్లు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. గత వారం భారత మహిళల జట్టు గోల్డ్ మెడల్ మ్యాచ్ గెలిచిన తర్వాత బ్రాంజ్ గెలిచిన పాకిస్థాన్ ప్లేయర్లతో పోడియంను పంచుకున్న విషయం తెలిసిందే. మహిళల టీ20లో శ్రీలంక రన్నరప్‌గా నిలిచింది.