Resign : అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కు కొన్ని నెలల ముందు పంజాబ్ కాంగ్రెస్ (Punjab Congress) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ (Amarinder Singh Raja Warring) తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) కు రాజీనామా లేఖ అందించారు. 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే ఉన్న సమయంలో ఈ మార్పు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కొత్త అధ్యక్షుడి పేరును 24 నుంచి 48 గంటల్లో ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మాజీ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. జలంధర్ కాంట్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్, గురుదాస్పూర్ ఎంపీ సుఖ్జిందర్ సింగ్ రంధావా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ పేరు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. రాజా వారింగ్ రాజీనామాకు పంజాబ్ కాంగ్రెస్లో చాలాకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ప్రధాన కారణంగా తెలుస్తున్నది.
ముఖ్యంగా వారింగ్ వర్గానికి, చరణ్జిత్ సింగ్ చన్నీ వర్గానికి మధ్య విభేదాలు పార్టీ కార్యక్రమాలు, సమావేశాల్లోనూ బయటపడ్డాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ గతంలో వారింగ్ను రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిస్తూ చన్నీకి పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించింది. అయినా విభేదాలు పూర్తిగా సమసిపోలేదు. ఇటీవల పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన సచిన్ పైలట్ రాష్ట్ర నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు.
పార్టీ పరిస్థితి, అంతర్గత విభేదాలపై నివేదికను అధిష్ఠానానికి సమర్పించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ నివేదిక తర్వాతే రాష్ట్ర నాయకత్వంలో మార్పుపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాజా వారింగ్ 2022 ఏప్రిల్లో పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆయన స్థానంలో కొత్త నాయకుడిని నియమించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నది.