రుద్రంపూర్, అక్టోబర్ 01 : అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాతా శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మదర్ థెరిసా సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, జాతీయ సేవారత్న అవార్డు గ్రహీత గూడెల్లి యాకయ్యను ఘనంగా సన్మానించారు. గత 20 సంవత్సరాలుగా వివిధ సేవా రంగాల్లో, ముఖ్యంగా వయోవృద్ధుల సంక్షేమం కోసం ఆయన అందిస్తున్న విశేష సేవలను గుర్తించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ విద్యా చందన చేతుల మీదుగా సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా గూడెల్లి యాకయ్య మాట్లాడుతూ.. సమాజంలో నిరాదరణకు గురైన వయోవృద్ధులకు అండగా నిలిచి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడమే తన లక్ష్యమని తెలిపారు. సన్మానాలు, పురస్కారాలు తన బాధ్యతను మరింత పెంచుతాయని, భవిష్యత్లో మరింత అంకితభావంతో సేవా కార్యక్రమాలను కొనసాగించేందుకు ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు. వయో వృద్ధులకు గౌరవప్రదమైన జీవనం అందించడంతో పాటు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.