రామవరం, జనవరి 09 : అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లపై రామవరం రేంజ్ ఫారెస్ట్ అధికారులు ఉక్కుపాదం మోపారు. పెనగడప ఫారెస్ట్ డీఆర్ఓ పిల్లి సలూజ శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో రేంజ్ పరిధిలోని ములుగుగూడెం వద్ద రిజర్వ్ ఫారెస్ట్ వాగులో నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నంబర్ ప్లేట్లేని ఓ ట్రాక్టర్ను పట్టుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని రామవరం రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు ఆమె తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.