– ఇసుక ర్యాంపుల వద్ద పేకాట
బూర్గంపహాడ్, జూన్ 10 : అధికారిక ఇసుక ర్యాంపుల్లో నిర్వాహకుల కనుసన్నల్లో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ప్రజలు మండిపడుతున్నారు. బూర్గంపహాడ్ మండలం సోంపల్లిలో ఇటీవల అధికారికంగా మూడు ర్యాంపులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఇసుక ర్యాంపుల నిర్వాహకులు ముందుగా అనుమతి ఇచ్చిన రహదారిని కాకుండా అనధికారికంగా రహదారి వేసుకుని ఇసుక రవాణాను నిబంధనలకు విరుద్ధంగా సాగిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. సారపాక ఐటీసీ కర్మాగారంలో ఉద్యోగం చేస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు మరో వ్యక్తి సోంపల్లిలో ఇసుక వ్యాపారాన్ని సాగిస్తున్నారు. మైనింగ్ శాఖ నిర్వహణలో ఈ ర్యాంపు నడుస్తున్నా నిబంధనలను పాటించకుండా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మైనింగ్ శాఖ నిబంధనల ప్రకారం కాకుండా లోతు ఎక్కువగా తీస్తూ ఇసుక రవాణా సాగిస్తున్నారనే విమర్శలు ఈ ర్యాంపులపై లేకపోలేదు.
అధికారికంగా ఉన్న ఇసుక ర్యాంపుల వద్ద ఇసుక రవాణాతో పాటు పేకాట కూడా జోరుగా సాగుతోంది. ఇసుక ర్యాంపుల నిర్వహణ నిబంధనలు పాటించి చేయాల్సి ఉన్నప్పటికీ నిబంధనలు పాటించకపోవడంతో పాటు ఇలా కొందరు అక్కడే ఓ చెట్టు నీడన సేదతీరి గ్రూపులుగా చేరి పేకాట ఆడుతున్నారు. తాజాగా పోలీసుశాఖ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాని హెచ్చరికలు జారీచేసినప్పటికీ ఇలాంటి వ్యక్తులు ఇసుక ర్యాంపుల వద్ద పేకాట ఆడడంపై పోలీసు తీరు పట్ల సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. ఏదేమైనా ఇసుక ర్యాంపుల నిర్వహణ విషయంలో నిర్వాహకులు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని మైనింగ్ శాఖతో పాటు సంబంధిత శాఖలు పర్యవేక్షణ చేయాలని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవడంతో పాటు అసాంఘీక శక్తుల భరతం పట్టాలని పలువురు మండిపడుతున్నారు.

సోంపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు ?