చుంచుపల్లి, మే 27 : చుంచుపల్లి మండల పరిధిలోని పెనుబల్లి గ్రామ పంచాయతీ వద్ద గోధుం వాగులో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సిద్ధల వెంకన్న ఎడ్లబండిపై ఇసుక తీసుకురావడానికి వాగులోకి వెళ్లగా, నీటితో నిండిపోయిన లోతైన గోతిని గుర్తించలేక బండి అదుపుతప్పి గోతిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో రెండు దుక్కిటెద్దులు అక్కడికక్కడే మృతి చెందగా, రైతు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. గోధుంవాగులో నిత్యం ఎడ్లబండ్లపై అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతూనే ఉందని, అదే విధంగా నిరంతర ఇసుక తవ్వకాల వల్ల వాగులో ప్రమాదకర గోతులు ఏర్పడ్డాయని ఆరోపిస్తున్నారు. వాగులో నీటితో నిండిపోయిన ఈ గోతులు బయటకు కనిపించకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు.
ప్రతిరోజూ గ్రామస్తులు, రైతులు వాగు దాటుతూ రాకపోకలు సాగిస్తుండగా, ఇలాంటి ప్రమాదకర గోతులు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. అధికారులకు అక్రమ ఇసుక తవ్వకాల విషయం తెలిసినా పట్టించుకోక పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. అక్రమ తవ్వకాలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, వాగు ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసి ప్రమాదకర గోతులను పూడ్చివేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.