పరకాల, ఆగస్టు 16 : హనుమకొండ జిల్లా పరకాలలో ఆదివారం ఏర్పాటు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పరకాల పట్టణ అభివృద్ధికి వరాలు కురిపిస్తాడని ఎదురుచూసిన స్థానిక ప్రజలకు నిరాశే మిగిలింది. సభ ఆసాంతం ప్రతిపక్షాలను తిట్టడమే తప్ప అభివృద్ధిపై ఏ ఒక్క ప్రకటన చేయలేదు. సీఎం పర్యటన మొత్తం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకే పరిమితమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన వంద పడకల ఆస్పత్రి, ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ప్రారంభించి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ తదితర నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన ‘ప్రజా పాలన-ప్రగతి బాట’ సభలో ప్రసంగించిన సీఎం పరకాల అభివృద్ధిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
పరకాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏవైనా ప్రత్యేక నిధులు కేటాయిస్తారని ప్రజలు ఆశించారు. అలా జరగకపోవడంతో సీఎం ప్రసంగానికి స్పందన కరువైంది. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోనే మహిళలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. పోలీసులు కొన్ని బారికేడ్లు అడ్డుపెట్టి వారిని బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది కాపలాగా ఉన్నా సభా ప్రాంగణం నుంచి మహిళలు వెళ్లిపోవడంతో ఖాళీ కుర్చీల మధ్యనే సీఎం రేవంత్ ప్రసంగం కొనసాగింది.
పరకాల అభివృద్ధికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు విమర్శలకు దారితీశాయి. హెలీప్యాడ్ నుంచి సభాస్థలికి సీఎం కాన్వాయ్ వెళ్లే దారిలో వీధి వ్యాపారుల కోసం బీఆర్ఎస్ హయాంలో మొదలు పెట్టిన షాపింగ్ కాంప్లెక్స్ కనబడకుండా అడ్డుగా తెల్లటి క్లాత్‌ను కట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా ప్రజలకు అవసరమయ్యే నిర్మాణాలను పూర్తిచేయకుండా తాత్సారం చేస్తున్నదని, చిత్తశుద్ధి ఉంటే షాపింగ్ కాంప్లెక్స్‌ను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు వీధి వ్యాపారులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డు పక్కన తాము ఏర్పాటు చేసుకున్న చిన్నచిన్న దుకాణాలు తొలగించి పొట్టకొడుతున్నదని మండిపడ్డారు.
పరకాల : సీఎం రేవంత్ రెడ్డి పరకాల పర్యటనలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బహిరంగమయ్యాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరు కున్నాడు. ఈ క్రమంలో కళాశాల గేటు వద్ద పోలీసులు అడ్డుకొని ప్రొటోకాల్ లిస్టులో పేరు లేదని లోపలికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన ఇనుగాల అకడి నుంచి తిరిగి వెళ్లిపోయాడు.
ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. సీనియర్ నాయకుడనని చెప్పుకునే ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఒంటెద్దు పోకడలతో పదేండ్ల పాటు కాంగ్రెస్‌ను కాపాడిన నాయకులను చిన్నచూపు చూస్తున్నాడని, పసుపు రంగు పార్టీ మూలాలు ఉన్న వారిని అందలం ఎకిస్తున్నాడంటూ ఇనుగాల వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్పందించాలని, లేని పక్షంలో దిగుమతి నేతలు పార్టీని భ్రష్టు పట్టిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.