- పట్టించుకోని అటవీశాఖ
బూర్గంపహాడ్, జూన్ 18 : బూర్గంపహాడ్ మండలం సారపాక పంచాయతీ పరిధిలోని భాస్కరనగర్ ప్రాంతంలోని ఫారెస్ట్ భూముల్లో జేసీబీతో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అటవీ భూముల్లో కొందరు అక్రమార్కులు జేసీబీలతో తవ్వకాలు జరిపి ట్రాక్టర్ల ద్వారా రవాణా సాగిస్తున్నారు. ఈ అక్రమ మట్టి తవ్వకాలతో సారపాక, భాస్కరనగర్ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా అటవీ భూముల్లో జేసీబీలతో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి వ్యాపారం చేస్తున్న వ్యక్తులపై సంబంధిత శాఖ అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి అటవీ భూముల్లో తవ్వకాలు జరగకుండా నియంత్రించాలని, అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సారపాక, భాస్కరనగర్ ప్రజలు కోరుతున్నారు.