ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj), కర్ణాటక ఎన్నికల సంఘం (Election Commission) మధ్య ఓటరు జాబితా సవరణ వ్యవహారం పెద్ద వివాదంగా మారింది. తన ఓటును తొలగించారంటూ ప్రకాశ్ రాజ్ ఆరోపించగా, ఆయన శాశ్వతంగా ఇల్లు మారినందునే షిఫ్టెడ్ అని గుర్తించామని, ఓటును తొలగించలేదని ఈసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తీరుపై ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కర్ణాటకలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా తన ఓటరు ఐడీని కొత్త చిరునామాకు మార్చుకోవాలంటూ ఎన్నికల సంఘం చెబుతుండటాన్ని ప్రకాశ్ రాజ్ సవాల్ చేశారు. తన పేరును బెంగళూరు ఓటరు జాబితా నుంచి పూర్తిగా తొలగించారని, ఆ తర్వాతే అధికారులు వారి తప్పు ఒప్పుకున్నారని ఆయన ఆరోపించారు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేసిన ప్రకాశ్ రాజ్.. ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. నా ఓటరు ఐడీ శాశ్వతంగా మారిపోయిందని (Permanently Shifted) మీ వెబ్సైట్లో పెట్టలేదా? అంటే నా ఓటు తొలగించారనే కదా అర్థం. అందుకే కొత్త ఓటరు ఐడీ కోసం ఫామ్-6 నింపాలని చెప్పారు. కానీ, నేను ఈ విషయాన్ని బయటపెట్టి, అది లక్షలాది మందికి చేరిన తర్వాత మీ అధికారులే ఫోన్ చేసి పొరపాటు జరిగిందని, సరిదిద్దుకుంటామని చెప్పారు కదా! అని ఆయన నిలదీశారు.
Fraand … You can’t abuse the DIGNITY of a CITIZEN #justasking pic.twitter.com/GyUvheAHO5
— Prakash Raj (@prakashraaj) August 13, 2026
అయితే, ప్రకాశ్ రాజ్ ఆరోపణలను బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఆయన ఓటు ఎక్కడికీ పోలేదని, యాక్టివ్గానే ఉందని స్పష్టం చేశారు. బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) నిర్వహించిన విచారణలో.. ప్రకాశ్ రాజ్ గత నాలుగేళ్లుగా ఆ రిజిస్టర్డ్ అడ్రస్‌లో నివసించడం లేదని పక్కవార్లు, ఫ్లాట్ ఓనర్ నిర్ధారించారని తెలిపారు. అతడు ఉన్న ప్రాంతంలో విచారణ జరిపిన తర్వాతే ఆయన ఓటరు స్థితిని ‘షిఫ్టెడ్’గా మార్చామని, ప్రస్తుత నివాస చిరునామా కోసం ఆయన ఫామ్-6 ద్వారా మళ్లీ రిజిస్టర్ చేసుకోవచ్చని అధికారులు వివరించారు.
అధికారుల ప్రకటనపై ప్రకాశ్ రాజ్ మరింత తీవ్రంగా స్పందించారు. ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే మాట మారుస్తోందని, ప్రెస్ మీట్ పెట్టి పచ్చి అబద్ధాలు చెబుతోందని ఆయన మండిపడ్డారు. వివాదం పెద్దది కావడంతోనే హడావుడిగా బిఎల్ఓ (BLO)లను పంపి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ పోరాటం కేవలం సెలబ్రిటీ అయిన తనకోసం కాదని, సామాన్య పౌరుడి ఆత్మగౌరవం కోసం అని స్పష్టం చేస్తూ.. ఈ అంశంపై మరిన్ని వీడియోలు, క్లారిఫికేషన్లు ఇస్తానని, గేమ్ ఆన్ అంటూ ప్రకాశ్ రాజ్ హెచ్చరించారు.