న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారత్ అధ్యక్షతన ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా భద్రతా విధుల్లో ఉన్న ఒక పోలీస్ తన వద్ద ఉన్న గన్స్‌తో రీల్స్ చేశాడు. ఈ వీడియో క్లిప్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ పోలీస్‌ను సస్పెండ్ చేశారు. (Cop Reels With Gun) సెప్టెంబర్ 12, 13 తేదీల్లో నిర్వహించిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ దీపక్ బంగర్ రూఫ్‌టాప్ స్నైపర్ డ్యూటీ నిర్వహించారు. విదేశీ ప్రతినిధులు బస చేసిన రెండు ఫైవ్ స్టార్ హోటళ్లలో ఒక దానిలో భద్రత కోసం ఆయనను నియమించారు.
కాగా, బ్రిక్స్ సదస్సు భద్రత కోసం విధుల్లో ఉన్నప్పుడు పోలీస్ కానిస్టేబుల్ దీపక్, తుపాకులను ప్రదరిస్తూ రీల్స్ రికార్డ్ చేశాడు. ఒక వీడియోలో సాధారణ నల్ల చొక్కా ధరించి చేతిలో లైట్ మెషిన్ గన్ పట్టుకుని కనిపించాడు. రాత్రిపూట నగర దృశ్యాన్ని చూపిస్తూ కెమెరా ప్యాన్ చేస్తుండగా ఆ గన్ను గురిపెడుతున్నట్లుగా పోజులిచ్చాడు. మరో వీడియోలో తన మెడలో బ్రిక్స్ సదస్సు గుర్తింపు కార్డును ధరించిన ఆ పోలీస్ కానిస్టేబుల్, తన జేబులో ఉన్న పిస్టల్‌ను ప్రదర్శించాడు.
మరోవైపు పోలీస్ కానిస్టేబుల్ దీపక్, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ రీల్స్ వైరల్ అయ్యాయి. దీంతో ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారుల దృష్టిని ఇవి వెళ్లాయి. ఈ నేపథ్యంలో పోలీస్ కానిస్టేబుల్ దీపక్‌పై చర్యలు చేపట్టారు. ఆయనను సస్పెండ్ చేశారు. ఆ పోలీస్‌పై శాఖాపరమైన విచారణ కూడా జరుగుతున్నది.