బూర్గంపహాడ్, ఏప్రిల్ 06 : కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఐటీసీ యాజమాన్యం పరిష్కరించకపోయినా, చర్చలకు పిలవకపోయినా రిలే దీక్షలు కాస్తా సమ్మెకు దారి తీస్తాయని, సమస్యలు పరిష్కరించని పక్షంలో త్వరలోనే సమ్మె బాట పడతామని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బల్లెం నాగయ్య, ఎండీ యాకూబ్‌పాషా తెలిపారు. సోమవారం రిలే నిరాహార దీక్షలు 12వ రోజుకు చేరుకోవడంతో జేఏసీ సభ్యులు సింగారపు సతీష్, కోడూరు శ్రీనివాసరావు, సందిపాము బాబు, మేకల శేషమ్మ, పడాల మధు, గూడూరు సత్యవతి దీక్షల్లో పాల్గొని తమ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ.. రెండు వారాలుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ఐటీసీ యాజమాన్యానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. కార్మికులన్నా, కార్మిక సమస్యలన్నా అంత చులకనా అంటూ ఐటీసీ తీరుపై మండిపడ్డారు. తక్షణమే 13వ వేతన ఒప్పంద కాలంలో పెండింగ్ సమస్యలు పరిష్కరించి జేఏసీతో 14వ వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. ఐటీసీ కాంట్రాక్టు సమస్యలపై చర్చలకు పిలవని పక్షంలో త్వరలోనే సమ్మె బాట పడతామని హెచ్చరించారు. ఈ దీక్షా శిబిరంలో జేఏసీ సభ్యులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.