బూర్గంపహాడ్, ఏప్రిల్ 02 : కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించే విషయంలో ఐటీసీ యాజమాన్యం చర్చలకు రాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బెల్లం నాగయ్య, ఎండీ యాకూబ్‌పాషా హెచ్చరించారు. గురువారం రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరుకోవడంతో దీక్షలో కడారి జయరాం, రేపల్లి చంద్రశేఖర్, బొక్కా సత్యనారాయణ, అలుగోలు నాగరాజు, ముళ్లపూడి వెంకటసత్యనారాయణ, వెలిశెట్టి సత్యనారాయణ, మిట్టకంటి రవీంద్రారెడ్డి, మోతుకూరు ముత్యాలరావు, బూయన్న వెంకటేశ్వర్లు పాల్గొని తమ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ.. 13వ వేతన ఒప్పంద కాలం పూర్తయినా సమస్యలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయన్నారు. 14వ వేతన ఒప్పందం జేఏసీతో కలిసి చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంట్రాక్టు కార్మికులకు అవసరమైన అన్ని డిమాండ్లు న్యాయబద్ధంగా అడుగుతున్నా యాజమాన్యం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. కార్మికులతో చర్చలకు రాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ దీక్షా శిబిరంలో జేఏసీ సభ్యులు ఆకిని సర్వేశ్వరరావు, ఈతకోటి జాన్సన్, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, మిరియాల రాములతో పాటు కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.