రుద్రంపూర్, ఏప్రిల్ 15 : మానవత్వమే అసలైన భక్తి అని, మతాల పేరుతో విభేదాలు సృష్టించుకోవద్దని అబ్దుల్ రెహమాన్ అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని వర్క్ షాప్లో బుధవారం ఈద్ మిలాప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వర్క్ షాప్ హెచ్.ఓ.డి జే. క్రిస్టఫర్ నాయకత్వంలో ఫిట్ కార్యదర్శి ఎం.డి.సత్తార్ పాషా అధ్యక్షతన ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన వక్త మాట్లాడుతూ.. పవిత్ర ఖురాన్ రంజాన్ మాసంలో అవతరించిందని తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసాలు ఉండి, ఫిత్రా, జకాత్ ద్వారా పేదవారికి దానధర్మాలు చేస్తారని చెప్పారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన ఈ మాసం ప్రత్యేకతలు అన్నారు.
ఏరియా ఇన్చార్జి జీఎం ఎం.నరసింహారావు మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులు కులమతాలకు అతీతంగా ఐక్యంగా పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. “మనమంతా బాగుండాలి” అనే భావనతో ముందుకు సాగాలని సూచించారు. సంస్థ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి కట్టుబడి పని చేయాలని కోరారు. అబ్దుల్ బాసిత్, రజాక్ తదితరులు రంజాన్ పర్వదిన విశిష్టతను వివరించారు. తల్లిదండ్రులకు గౌరవం, పొరుగువారితో సత్సంబంధాలు, మానవతా విలువలు పాటించడం ద్వారానే నిజమైన భక్తి సాధ్యమని పేర్కొన్నారు.
ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జై గట్టయ్య మాట్లాడుతూ.. వర్క్ షాప్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఉద్యోగులు కలిసి దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగలను ఐక్యతతో నిర్వహించుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం కార్మికులు అందరికీ షీర్ ఖుర్మా (సేమియా పాయసం) పంపిణీ చేశారు. కార్యక్రమం అనంతరం అందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఓ.టి జి.ఎం జీవి కోటిరెడ్డి, ఏజీఎం (ఈ & ఎం) సూర్యనారాయణ రాజు, డీజీఎం పర్సనల్ జి.వి. మోహన్ రావు, సూపర్వైజర్లు, ఉద్యోగులు, నాయకులు, అప్రెంటీసులు పాల్గొన్నారు.

‘మానవత్వమే అసలైన భక్తి’