హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడైన అనుముల కొండల్‌రెడ్డి మాస్టర్ ఫ్రాడ్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన ‘ఎక్స్’ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఉన్న ఓ చిన్న గోడౌన్లో టెసెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ ఉన్నదని ఫొటోతో సహా పోస్టు చేశారు. ఆ కంపెనీయే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎకోసిస్టమ్ అని చెప్తున్నారని తెలిపారు. దీనికి అనుముల కొండల్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఆ హోదాతోనే కొండల్‌రెడ్డి యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం(యూఎస్ఐఎస్పీఎఫ్)లో ఇండియా ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ బోర్డులో సభ్యుడిగా చేరుతున్నారని, ఇదెలా సాధ్యమవుతుంది? అని ప్రశ్నించారు. క్రిశాంక్ చేసిన ఈ పోస్టును నెటిజన్లు పెద్ద ఎత్తున రీపోస్టు చేస్తున్నారు.
అతి తక్కువ ధరకే రూ.135 కోట్ల విలువైన భూమి ధారాదత్తం
రాష్ట్రంలో కండ్లు చెదిరిపోయే అవినీతి జరుగుతున్నదని క్రిశాంక్ ఆరోపించారు. కొండల్‌రెడ్డికి చెందిన ‘టెసెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేటు లిమిటెడ్’ కంపెనీకి టీజీఐఐసీకి చెందిన రూ.135 కోట్ల విలువైన భూమి ని.. రేవంత్ సర్కార్ ఒక స్కేర్ మీటర్‌కు కే వలం రూ.3,707 చొప్పున అప్పగించినట్టు క్రిశాంక్ ఆరోపించారు. మహేశ్వరం మండ లం రావిర్యాలలోని 20,234 స్కేర్ మీటర్ల భూమిని కొండల్‌రెడ్డి కంపెనీకి కేటాయించినట్టు తెలిపారు. సీఎం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దీనికి బాధ్యత వహిస్తూ రేవంత్‌రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో క్రిశాంక్ మరో పోస్టు చేయడం సంచలనంగా మారింది.