INDIA bloc : కేంద్రంలోని ప్రతిపక్షాల కూటమి అయిన ఇండియా బ్లాక్ పార్టీలు సెప్టెంబర్ 30న సమావేశం కానున్నాయి. ఎన్నికల సంఘం పనితీరు, సర్, జ్ఞానేష్ కుమార్ రాజీనామా వంటి అంశాలపై ఇండియా బ్లాక్ పార్టీలు చర్చలు జరపనున్నాయి. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్కు పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ హాజరుకానున్నారు.
సర్ సందర్భంగా అవకతవకలు, ఎన్నికల సంఘం సభ్యుల మధ్య విబేధాల నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. అతడిని పదవి నుంచి తొలగించేందుకు పార్లమెంట్లో అభిసంశన తీర్మానం ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నాయి. ఈ విషయంలో ఉమ్మడిగా కలిసి పని చేయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ అంశంలో కేంద్రంపై ఎలా ఒత్తిడి తేవాలనే అంశంపై చర్చించనున్నాయి. ఈ అంశంపై చర్చించుకునేందుకు సెప్టెంబర్ 29న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ప్రస్తుత ఈసీఐ అంశం ప్రతిపక్షాల్ని ఏకతాటిపైకి తేవడానికి ఉపయోగపడింది.
ముఖ్యంగా బెంగాల్లో టీఎంసీని, ఆ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న సీపీఐ (ఎం)ను కూడా కలిపింది. సర్ విషయంలో జరిగిన అవకతవకలపై 23 ప్రతిపక్ష పార్టీలు, ఒక ఇండిపెండెంట్ ఎంపీ కలిసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి ఫిర్యాదు చేశారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా, తొలగింపు అంశం ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతోంది. మరోవైపు అతడి రాజీనామాను సీజేపీ కూడా డిమాండ్ చేస్తోంది. ఆయన రాజీనామా చేయకుంటే అక్టోబర్ 2 నుంచి ఆందోళన చేస్తామని సీజేపీ ప్రకటించింది. ఇటీవల ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సీజేపీ చేసిన ఆందోళన ఎలాంటి ప్రభావం చూపిందో తెలిసిందే.