హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): కుటుంబానికి మూడెకరాలకు మించి మాగాణి భూమి ఉన్నా, 7.5 ఎకరాల మెట్ట భూమి ఉన్నా సామాజిక పింఛన్ రానట్టే. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, అర్బన్ ఏరియాల్లో రూ. 2 లక్షలకు మించి కుటుంబ వార్షికాదాయం కలిగిన వారూ అనర్హులే. కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ, ప్రైవేట్, వృత్తి నిపుణులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నా ఆ ఇంటిలోని ఇతర వ్యక్తులు పింఛన్ ఆశలు వదులుకోవాల్సిందే.. ఇవీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకం కింద సామాజిక పింఛన్ల మంజూరుకు లబ్ధిదారుల ఎంపిక కోసం శనివారం జారీచేసిన మార్గదర్శకాలు.
ఈ నెల 15 నుంచి 2.25 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తామని ఘనంగా ప్రకటించిన ప్రభుత్వం.. కొర్రీలు పెడుతూ కఠినమైన మార్గదర్శకాలు విడుదల చేయడంపై దరఖాస్తుదారులు, లబ్ధిదారులు ఆగ్రహం తో రగిలిపోతున్నారు. అర్హులందరికీ పిం ఛన్లు మంజూరు చేస్తామని చెప్పిన ప్రభు త్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే రెండున్నరేండ్లలో సుమారు 2.50 లక్షల మంది లబ్ధిదారులను తొలగించింది. అంతటితో ఆగకుండా మరింత మందికి కోతలు పెట్టేందుకు సిద్ధమైంది. 2.25 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన సర్కార్.. అంతకు రెట్టింపు మంది లబ్ధిదారులను ఏరివేతకు ఉపక్రమించింది.
గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో రూ. 2 లక్షలకు మించి కుటుంబ వార్షికాదాయం కలిగిన వారు అనర్హులేనని ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. కుటుంబానికి మూడెకరాలకు మించి మాగాణి భూమి, 7.5 ఎకరాలకు మంచి మెట్ట భూమి ఉన్నా పింఛన్ కట్ చేయాలని తెలిపింది. కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ, ప్రైవేట్, వృత్తి నిపుణులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నా ఆ కుటుంబంలోని వారిని సైతం ప్రభుత్వం అనర్హులుగా పరిగణించనున్నది. కుటుంబంలోని వ్యక్తికి సొంతంగా రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు, కారు ఇతర ఫోర్‌వీలర్ వాహనాలు ఉన్న పింఛన్ మంజూరుకు నిరాకరించాల్సిందేనని నిబంధన విధించింది. ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఇతర పింఛన్లు పొందుతున్న వారు చేయూత పథకానికి అర్హులు కాదని సర్కార్ ప్రకటించనున్నది.
కొత్త పింఛన్ల మంజూరులో బీడీ కార్మికులు, వృద్ధులు, టేకేదార్లు, ఎయిడ్స్ బాధితులు, వృద్ధ కళాకారులను ప్రభు త్వం విస్మరించింది. ఈ నెల 15న వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగు లు, గీత, నేత కార్మికులు, పైలేరియా బా ధితులు, డయాలసిస్ రోగులకు మాత్ర మే మంజూరు చేస్తామని ప్రకటించింది. ఈ అర్హత కలిగిన వారే శనివారం నుంచి పంచాయతీ, వార్డు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నది. వీరికి కూడా పాత విధానంలో రూ.2,016 చొ ప్పున మాత్రమే నగదు అందజేస్తామని ప్రకటించింది. అంటే ఇప్పట్లో పింఛన్ పెంచబోమని చెప్పకనే చెప్పినైట్టెంది.
సర్కార్ వైఖరిపై పింఛన్ కోసం దరఖాస్తు చేసుకొని రెండున్నరేండ్లుగా ఎదురుచూస్తున్న ఎందరో దరఖాస్తుదారులు, ఇప్పటికే లబ్ధి పొందుతున్నవారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారంలోకి రాగానే 2018 జూన్ 2ను కటాఫ్‌గా పరిగణిస్తూ పీఎఫ్ ఉన్న బీడీ కార్మికులందరికీ పింఛన్లు ఇస్తామని ప్రకటించి ఇప్పుడు మోసం చేసిందని బీడీ కార్మికులు మండిపడుతున్నారు. 32 నెలలుగా ఊరించి దగా చేసిందని భగ్గుమంటున్నారు. 57 ఏండ్లు నిండిన వృద్ధులందరికీ (కుటుంబంలో ఎందరు ఉన్నా) పింఛన్లు ఇస్తామని హామీ గుప్పించి, ఇప్పుడు ధోకా చేసిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సర్కార్ నిర్ణయంతో ముఖ్యంగా వృద్ధులై ఒకరు మరణిస్తే అర్హత కలిగిన మరొకరు పింఛన్ కోసం రెండున్నరేండ్లుగా దీనంగా ఎదురుచూస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం 2014 నవంబర్‌లో ఆసరా పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటి విడత నెలకు రూ.1,000 చొప్పున నగదు అందజేసింది. 2015లో బీడీ కార్మికులు, 2017లో ఒంటరి మహిళలు, 2018లో బోదకాలు బాధితులు, 2022లో డయాలసిస్ పేషెంట్లు, 2023లో బీడీ కంపెనీల టేకేదార్లను లబ్ధిదారులుగా చేర్చింది. రెండోసారి అధికారంలోకి రాగానే పింఛన్ నగదును రూ.2,016 చేసింది. దివ్యాంగులకు అదనంగా మరో రూ.1,000 అందజేస్తూ వచ్చింది. ప్రభు త్వం నుంచి దిగిపోయే నాటికి అంటే 2023 డిసెంబర్ నాటికి 5,16,722 మంది దివ్యాంగులు, 16,38,089 వృద్ధులు, 15,84,063 వితంతువులు, 1,43,894 ఒంటరి మహిళలు, 67,034 గీత కార్మికులు, 38, 219 చేనేత కార్మికులు, 37,645 మంది ఎయిడ్స్ బాధితులు, 4,25,726 మంది బీడీ కార్మికులు, 18,633 బోధకాలు బాధితులు, 4,657 డయాలసిస్ పేషెంట్లు, 1,967 మంది వృద్ధ కళాకారులకు మొత్తంగా 44.70 లక్షల మందికి ఆసరా పథకం కింద పింఛన్లు అందించింది. ఇందుకోసం ప్రతినెలా సుమారు రూ.1,000 కోట్లు వెచ్చించింది. కానీ కాంగ్రెస్ లబ్ధిదారుల్లో కోత విధించింది.