చుంచుపల్లి, మార్చి 23 : జిల్లా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి పంటల దిగుబడులను గణనీయంగా పెంచుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. సోమవారం రామవరం కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంట వ్యాధి నివారణకు సంబంధించి నిర్వహిస్తున్న జాతీయ ఉచిత టీకాల కార్యక్రమంపై అవగాహన కల్పించే గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం జెండా ఊపి టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. కిసాన్ మేళా సందర్భంగా వ్యవసాయం, కృషి విజ్ఞాన కేంద్రం, పశు సంవర్ధక రంగాలకు సంబంధించిన వివిధ స్టాళ్లను కలెక్టర్ ప్రారంభించి సమగ్రంగా పరిశీలించారు. రైతులకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పద్ధతులు, నాణ్యమైన విత్తనాల వినియోగం, పంటల నిర్వహణ విధానాలు, వ్యవసాయ యంత్రాల వినియోగం, పంట రక్షణ చర్యలు, నీటి సంరక్షణ పద్ధతులపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు.
రైతులతో ప్రత్యక్షంగా ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు, వడగళ్ల వానలు వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులు శాస్త్రీయ మరియు ఆధునిక పద్ధతులను అనుసరించడం అత్యవసరమని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో జరుగుతున్న సాంకేతిక మార్పులను రైతులు స్వీకరించి, ఆధునిక విధానాల ద్వారా ఖర్చులను తగ్గిస్తూ దిగుబడులను పెంచుకోవచ్చని సూచించారు. కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న శిక్షణలు, శాస్త్రవేత్తల సలహాలు, ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంట మార్పిడి విధానాలను అమలు చేయడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు పంటల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. అదేవిధంగా సంప్రదాయ వ్యవసాయంతో పాటు వాణిజ్య పంటల సాగు, మిశ్రమ పంటల విధానం, పశుసంవర్ధక రంగాన్ని అనుసంధానం చేసుకోవడం ద్వారా రైతుల ఆదాయం పెంపొందించుకోవచ్చని వివరించారు.
ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కిసాన్ మేళా నిర్వహించబడిందని, రైతులకు ఒకే వేదికపై ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ మేళా ద్వారా రైతులు కొత్త పద్ధతులను నేర్చుకుని వాటిని తమ పొలాల్లో అమలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గణేష్, డిప్యూటీ మేయర్ సిరిపురం లలిత, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఉద్యానవన శాఖ అధికారి కిషోర్, మత్స్య శాఖ అధికారి ఇంతియాజ్ ఖాన్, త్రీ ఇంక్లైన్ సర్పంచ్ ఈసం ప్రవల్లిక, కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ భరత్, ఆత్మ చైర్మన్లు వీరభద్ర రావు, బుచ్చిబాబు, బోడా మంగీలాల్, శాస్త్రవేత్తలు, తాసీల్దార్, ఎంపీడీఓ, సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలి : కలెక్టర్ అంకిత్