చండ్రుగొండ, అక్టోబర్ 14 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో పత్తి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. చండ్రుగొండ మండలంలో పోకలగూడెం, రావికంపాడు, తుంగారం, రేపల్లెవాడ, తిప్పనపల్లి గ్రామాల్లో రైతులు 6 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. గత రెండు నెలలుగా కురుస్తున్న వానలతో చేతికొచ్చిన పత్తి పంట నేలపాలు అవుతున్నట్లు రైతులు వాపోతున్నారు. వర్షాల కారణంగా చేతికొచ్చిన పత్తి కాయలు పగలకుండా నల్లగా మారడం, నేలపై రాలిపోవడం, పగిలిన పత్తి కాయలు బూజుతో నల్లగా ఉండటం వంటివి జరుగుతున్నాయి. అధిక వర్షాల వల్ల ఈ ఏడాది నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి అధిక వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.