ఇల్లెందు, ఏప్రిల్ 26 : బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ రేపు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనుంది. 25 వసంతాల వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ జెండాలు ఆవిష్కరించాలని అధిష్టానం ఇప్పటికే పిలుపునిచ్చింది. ఈ పిలుపు అందుకున్న నాయకులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇల్లెందు పట్టణంలోని పలు వార్డుల్లో జెండా గద్దెలను నిర్మించారు. వాటికి గులాబీ రంగులద్ది ముస్తాబు చేశారు.
అలాగే నియోజకవర్గ పరిధిలో ఉన్న టేకులపల్లి, ఇల్లెందు, కామేపల్లి, గార్ల, బయ్యారం మండలాల్లోని పలు గ్రామాల్లో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గద్దెలు నిర్మించి, జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల నూతనోత్సాహంతో గ్రామాల్లో ఎటుచూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇల్లెందు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, పార్టీ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో సభకు భారీ ఎత్తున తరలేందుకు ఏర్పాట్లు చేశారు.
Yellandu : గులాబీ జెండాల ఆవిష్కరణకు గద్దెలు ముస్తాబు