– రాష్ట్ర పరిశీలకులు, జాయింట్ డైరెక్టర్ బి.వెంకట నర్సమ్మ
భద్రాద్రి కొత్తగూడెం. నవంబర్ 19 : ప్రతీ పాఠశాలలో పచ్చదనం ఉండేలా మొక్కలు పెంచాలని విద్యా శాఖ రాష్ట్ర డైరెక్టర్ వెంకట నర్సమ్మ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు పాఠశాలలను బుధవారం ఆమె సందర్శించారు. స్పెషల్ క్యాంపెయిన్ 5.0 లో భాగంగా, పాఠశాలల్లోని స్క్రాప్ ను పూర్తిస్థాయిలో తొలగించడం, పాఠశాల ఆవరణంలో మొక్కల్ని పెంచడం, టాయిలెట్లు శానిటరీ వర్కర్లతో ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవడం హెచ్ఎంల బాధ్యత అన్నారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జూలూరుపాడులో స్క్రాప్ ను తొలగించకుండా తరగతి గదుల్లో నిల్వ ఉంచడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా స్క్రాప్ ను పాఠశాల నుండి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంఈఓకు ఆదేశాలు జారీ చేశారు.
మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పడమట నరసాపురాన్ని ఆమె సందర్శించారు. పాఠశాల ఆవరణలో చెత్తా చెదారం నిల్వ ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే శానిటరీ వర్కర్స్, పంచాయతీ వారి సహకారంతో క్లియర్ చేయించాలని ఆదేశించారు. అదే విధంగా సుజాతనగర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, సింగభూపాలెం నందు నిర్వహిస్తున్న పరిశుభ్రతను చూసి ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులను అభినందించారు. తదుపరి లక్ష్మీదేవిపల్లి మండలంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హేమచంద్రపురంలను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ బి.నాగలక్ష్మి, విద్యాశాఖ కో ఆర్డినేటర్లు ఎస్.కె.సైదులు, ఏ.నాగరాజు, శేఖర్, ఎన్.సతీశ్ కుమార్, ఎంఈఓ లీల, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సంజీవరావు, లక్ష్మినరసయ్య, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Bhadradri Kothagudem : ‘పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రతను ఖచ్చితంగా అమలు చేయాలి’